- మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు
- మత్తులో విద్యార్థులను బాదుడు…
- గదిలోని బంధించిన గ్రామస్తులు
మన్యం న్యూస్ చర్ల:
మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఆ మత్తులో విద్యార్థులను దూషిస్తూ చితకబాదాడు. ఇదేమిటి అని అడిగిన వారిపై నీకెందుకు అంటూ దురుసైన సమాధానమిస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొచ్చాడు. వివరాల్లోకెళితే చర్ల మండలం లోని జి పి పల్లి గ్రామంలోని ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంచార్జ్ హెచ్ ఎం అయినటువంటి బానోత్ కృష్ణ బుధవారం మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఆ మత్తులో విద్యార్థులను చితకబాదాడు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడు వద్దకు వచ్చి ఇదేమిటి సార్ అని ప్రశ్నించగా వారితో విచక్షణ రహితంగా మాట్లాడుతూ దూషించాడు. దీనితో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుని ఓ గదిలో పెట్టి బంధించారు. ఇట్టి విషయంపై మన్యం ప్రతినిధి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జుంకీలాల్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు దీనిపై నివేదిక సమర్పించడంతో ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.





