విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా…
-పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి.
-శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
-జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. ఆయన మంగళవారం మణుగూరు సింగరేణి ఇల్లందు క్లబ్ లో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
వారికి న్యాయం చేకూర్చే విధంగా భరోసా కల్పించాలన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి, విచారణ చేపట్టి అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలను నిత్యం గమనిస్తూ వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్లూకోట్స్,
పెట్రోలింగ్ వాహనాలను అన్ని ప్రాంతాల్లో తిరిగేలా చూడాలన్నారు. నేర ఛేదన, నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మహిళలు, విద్యార్థినులకు షీ టీమ్స్ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, గంజాయి, మట్కా, బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
