మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 22
మండల పరిధి చిన్న ఆర్లగూడెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ గిరిజనుడికి చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే చిన్న ఆర్లగూడెం గ్రామానికి చెందిన కారం వీరభద్రం అనే ఆదివాసి గిరిజనుడికి చెందిన తాటాకుల ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో కుటుంబీకులు బయటకు పరుగులు తీసి కేకలు వేయగా గ్రామస్తులు చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోగానే అప్పటికే ఇల్లంతా మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు ఈ అగ్ని ప్రమాదంలో బాధితుడు కారం వీరభద్రం కుటుంబానికి చెందిన పత్తి, కొంత నగదు, బట్టలు వంట సామాను తదితర సామాలు పూర్తిగా కాలిపోయాయి. లక్ష రూపాయల వరకు ఆసి నష్టం జరిగిందని వాపోయారు.