మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 25, ఇటీవల కురిసిన (గులాబ్ తుఫాన్) అకాల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ శనివారం పరిశీలించారు. మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామానికి చెందిన సాయిల నరసింహారావు రైతు యొక్క దెబ్బతిన్న మొక్కజొన్న పంటను వ్యవసాయ శాఖ ఏడి కరుణ శ్రీ, ఏవో రఘుదీపిక తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లిందని, కెసిఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించి, సంబంధిత శాఖ నివేదిక ఆధారంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. కాబట్టి రైతులెవరు అధైర్యపడవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన, లేకున్నా తెలంగాణ ప్రభుత్వం పంట నష్టపోయిన కౌలు రైతుతో సహా ఆదుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనలో తెలిపారని గుర్తు చేశారు. త్వరలోనే వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా మొక్కజొన్న, మిరప, పెసర తదితర దెబ్బతిన్న పంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విధంగా నష్టపరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య పద్మ, ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ వీరభద్రం, మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, సీనియర్ నాయకులు వేల్పుల నరసింహారావు, ఎల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
