మన్యం న్యూస్ ఇల్లందు రూరల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు యాకన్న, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుసారంగపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఇల్లందు మండల పరిధిలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ తీగలంచ గ్రామంలో ఉపాధి హామీకూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకూలి 750 రూపాయలు ఇవ్వాలని,వారం రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని,ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారంకై ఐఎఫ్టియు-ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా నాయకులు తొగర సామెల్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఈసం లావణ్య,ఎట్టివరలక్ష్మి,చింతరాంబాబు, సనప బాయమ్మ,గోగ్గల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
