ఏపీలో ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. రెండోసారి కూడా గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఇప్పుడిప్పుడే వైసీపీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతున్నారు.
త్వరలోనే విజయసాయిరెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. అలాగే.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రంగంలోకి దిగారు. వైసీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో వాళ్లకు పలు కీలక సూచనలు చేశారు సజ్జల.
వచ్చే ఎన్నికల్లో ఏదో గెలిచాం అంటే గెలిచాం అని కాకుండా 175 స్థానాలకు 175 గెలుచుకోవాలని సూచించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా మిస్ కావొద్దని.. దాని కోసం తీవ్రంగా కష్టపడాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిపక్ష పార్టీకి ఒక్క సీటు కూడా వెళ్లొద్దని.. వాళ్లకు అస్సలే అవకాశం ఇవ్వొద్దన్నారు. అలాగే.. ఓటర్ జాబితా విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల.
అలాగే.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాయని.. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సజ్జల.. వైసీపీ నేతలకు సూచించారు. వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికర్స్ అనే ముద్ర వేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. వాలంటీర్ల వల్ల ఏపీలోని ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతోంది కానీ.. నష్టం కలగడం లేదు. కానీ.. వాలంటీర్లపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క వైసీపీ నేత తిప్పి కొట్టాలని సజ్జల స్పష్టం చేశారు.