రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
వైరా లో గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థె
రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 22, రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, అదే విధంగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవనున్నారని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను మరల మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. 9 సంవత్సరాల ఆరు నెలల పరిపాలన సమయంలో గుర్తుకు రాని, అమలు చెయ్యని హామీలు కేవలం ఎన్నికల కోసమే హడావిడిగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమని ఇది అందరూ గుర్తించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలను గ్రామాలలో గడప గడపకు తిరిగి వివరించాలని కార్యకర్తలను కోరారు. అందరం కలిసికట్టుగా శ్రమించి వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఎన్నికై మొదటిసారి జూలూరుపాడు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయబాయి, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ధారావత్ రాంబాబు, దుద్దుకూరి సుమంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు కృష్ణయ్య, ముత్తినేని రామయ్య, పుప్పాల నరసింహారావు, లేళ్ళ గోపాలరెడ్డి, వందనపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.