ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు¸
పొంతన లేని సమాధానాలతో పలు శాఖల అధికారులు గైర్హాజరు
సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ
మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన మంగళవారం నాడు సర్వసభ్య సమావేశం జరిగింది. 11 గంటలకు హాజరు కావలసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో 18 శాఖలకు గాను, 7 శాఖల అధికారులు హాజరు కావడం జరిగింది. చరవాణి ద్వారా కారణాలను అడగగా పలువురు అధికారులు పొంతనలేని సమాధానాలు తెలిపారు. వృత్తిపరంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని ఎంపీపీ గుమ్మడి గాంధీ సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, వృత్తి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి సరైన సమయానికి హాజరుకాని మీరు, వృత్తి పట్ల ఎలా ఉన్నారో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకుని సమయపాలన పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వరరావు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.