UPDATES  

 తిరోగమన ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్‌

 

2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను రు.45,03,097 కోట్లతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా భారతదేశంలో దారిద్య్రం లేకుండా చేస్తామని, పేదలు లేని భారత్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని ఘనంగా ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో దారిద్య్ర నిర్మూలనకు ఉపయోగపడే పథకాలతో పాటు, ఉత్పత్తి రంగానికి దోహదపడే కేటాయింపులు చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను గణనీయంగా తగ్గించారు. గత సంవత్సరం రాష్ట్రాల నుండి వచ్చే పన్నుల్లో కేంద్రం 42శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగా, గత సంవత్సరం నుండి 41 శాతానికి తగ్గించింది. తెలంగాణకు 2.133 శాతం మాత్రమే తిరిగి వస్తున్నది. అవికూడా సకాలంలో ఇవ్వడం లేదు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయించిన ప్రకృతివైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టారు. రాష్ట్రంలో సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్ర నదులపై కేంద్రం బోర్డులు వేసి తన ఆధీనంలోకి తీసుకున్నది. ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోయాయి. రాష్ట్రానికి మంజూరు చేసిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు తగ్గింది. దశాబ్ధాల తరబడి మంజూరైన కొన్ని పనులు పెండింగ్‌లోనే వుండిపోయాయి. కేంద్రం రాష్ట్రంపై కక్ష్యపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో స్పష్టమైంది.

ఈ బడ్జెట్‌లో రు.10,79,971 కోట్లు (24శాతం) వడ్డీలకిందనే చెల్లిస్తున్నారు. స్వదేశీ, విదేశీ అప్పులు కలిసి రు.137లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎకనమిక్‌ సర్వే తెలుపుతున్నది. 2025నాటికి 5ట్రిలియన్‌ డాలర్ల దేశ స్థూల ఉత్పత్తిని సాధిస్తామని ప్రధాని మోడీ అనేకసార్లు ప్రకటించారు. రానున్న రెండేళ్ళలో రెట్టింపు స్థూల ఉత్పత్తి పెరుగుతుందా? ఈ యేడాది దేశ వృద్ధిరేటు 7శాతం ఉన్నట్టు చెపుతూనే 2023-24లో 6.5శాతానికి తగ్గుతుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ స్థితిలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది?

ఉపాధిహామి పథకానికి 2022-23లో 89,400 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో 2023-24కు 60,000 కోట్లకే పరిమితం చేసారు. అలాగే ఆహార సబ్సిడీని గత సంవత్సరంపై 50శాతం తగ్గించారు. గ్యాస్‌పై సబ్సిడీని తగ్గించారు. ఆకలి సూచికలో భారతదేశం 191 దేశాల్లో 140వ స్థానాన్ని ఆక్రమించింది. విద్యలో 33వ స్థానం, ఆరోగ్యంలో 66వ స్థానం ఉన్న దేశం అభివృద్ధి కావడానికి ప్రస్తుత బడ్జెట్‌ సహకరిస్తుందా? ప్రజలు దారిద్య్రంలోకి వెళుతున్నప్పటికీ కార్పొరేట్లకు మాత్రం ఎన్‌.పి.ఏల పేరుతో రు.12లక్షల కోట్లు రుణాలు రద్దు చేసారు. కరోనా సందర్భంగా గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది.
కేంద్ర ఆర్ధికమంత్రి నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వున్నది.

వ్యాస కర్త
(తమ్మినేని వీరభద్రం)
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి,
తెలంగాణ రాష్ట్రం

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !