క్రీడలతోనే ఆరోగ్యం….
– యువత క్రీడల్లో రాణించాలి.
-క్రీడలకు ఎంతో ప్రాధాన్యత.
-పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 01: క్రీడలతోనే ఆరోగ్యమని, యువత క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు అన్నారు. ఆయన బుధవారం మణుగూరు ఏరియా స్టోర్స్ గ్రౌండ్ నందు టీడీఏ మాస్టర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందని, ఏ ఒక్క క్రీడాకారునికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రీడల వలన మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులను సాధించాలన్నారు.
క్రీడల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సిఐ ముత్యం రమేష్, ఎస్సై రాజ్ కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.