మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 01: కొంతమంది ప్రయాణికులు నిత్యం ప్రమాదపు అంచున తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అశ్వాపురం మండలంలోని పలు మారుమూల గ్రామాల నుంచి రైతులు, విద్యార్థులు, ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం అశ్వాపురం కు ఆటోలో ప్రయాణిస్తుంటారు. ఆటో డ్రైవర్లు ఇదే అదునుగా భావించి ఆటోల్లో పరిమితికి మించి వీలైనంత ఎక్కువమందిని ఎక్కించుకొని వాయువేగంతో వాహనాలను నడుపుతున్నారు. ఆటోలో 16 నుంచి 20 మందిని ఎక్కించుకుని ఓవర్‌లోడ్‌తో ఆటోలను నడుపుతున్నారు. ఎప్పుడు ఎక్కడో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా ఉంటున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.