ఫిబ్రవరి 6 వతేదీ ఉదయం 4 గంటలకు రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో టర్కీ, సిరియా దేశాల్లో కంపించిన భూమి..పెను విలయాన్నే సృష్టించింది. ఒకేరోజు మూడు సార్లు భారీగా కంపించడంతో టర్కీ, సిరియా దేశాల్లో మరణ మృదంగం మోగింది. మృత్యుకేళి ఇంకా కొనసాగుతోంది. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకూ 34 వేలకు పైగా మరణించారు. ఒక్క టర్కీ దేశంలోనే 29,605 మంది మరణించారు. సిరియాలో ఇప్పటి వరకూ 4,574 మంది మృత్యువాత పడ్డారు. ఏకంగా మూడుసార్లు భూమి భారీ స్థాయిలో కంపించడంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి.
శిధిలాల కింద వేలాదిమంది చిక్కుకుపోయారు. శిధిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. శిధిలాల కింద చిక్కుకున్నవారిలో ఇంకెవరూ ప్రాణాలతో బయటపడే పరిస్థితుల్లేవని తెలుస్తోంది. అంటే ఇక శిధిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలే బయటపడవచ్చు. టర్కీలో సహాయక చర్యలు కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వివిధ దేశాల్నించి తరలివచ్చిన ప్రత్యేక బృందాలు శిధిలాల్ని తొలగిస్తూ చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. అధికశాతం మృతదేహాలే బయటపడుతున్నాయి. మరణాల సంఖ్య ఇప్పటికే 34 వేలు దాటింది. ఇంకా పెరగవచ్చని అంచనా.