అధిక లోడ్ … అయినా డోంట్ కేర్
అధిక లోడులపై అలసత్వం ఎందుకు..?
– మరిన్ని ప్రమాదాలు జరిగితే గాని మేలుకోరా..?
– సమస్య పరిష్కారం ఎన్నడు..?
– ఓవర్ (లోడ్) అవుతున్న కర్ర ట్రాక్టర్లు..!
– నామమాత్రంగా అధికారుల చర్యలు..!
మన్యం న్యూస్, భద్రాచలం : అమ్మో అంత లోడ్ అయిన డోంట్ కేర్.. మేమింతే మారమంతే.. ముసలమ్మ గుడ్డిదైతే మనవడు వచ్చి మొట్టికాయ కొట్టినట్టు చందంగా అధికారుల చర్యలు నామ మాత్రమే.అధిక లోడుతో వస్తున్న కర్ర ట్రాక్టర్లు అడ్డు అదుపు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలోనే ఎన్నో కర్ర ట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు గురవడం, అదుపుతప్పి పల్టీ కొట్టడం వంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇదే సందర్భంలో కర్ర ట్రాక్టర్ల డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఓవర్ లోడ్ తో వస్తున్న కర్ర ట్రాక్టర్ల వల్ల జరిగే ప్రమాదాలు అధికారులకు తెలియనిది అయితే కాదు. ఇప్పటికే ఈ ఓవర్ లోడ్ తో వస్తున్న కర్ర ట్రాక్టర్లు ఎంతోమంది డ్రైవర్లను పొట్టను పెట్టుకున్నాయి. ఇది భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో నిత్యం సాధారణంగా జరిగే సంఘటనే అధికారులకు అనిపిస్తున్నది కాబోలు, అందుకే ఈ సమస్యను పరిష్కరించే చర్యలు ఊపందుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు రంగంలోకి దిగాలని ప్రజలు కోరుతున్నప్పటికీ నామమాత్రపు చర్యలు తీసుకుంటూ, చలనాలు విధిస్తూ ఉంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడుతో వెళ్తున్న కర్ర ట్రాక్టర్ ఓనర్ల సైతం అధికారులు చలనాలు విధిస్తూ వదిలిపెడుతున్న నేపథ్యంలో ఆ చలానాకు సరిపడే విధంగా మరింతగా కర్రలు లోడ్ చేసుకొని వస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఓవర్ (లోడ్) అవుతున్న కర్ర ట్రాక్టర్లు..!
సారపాక పట్టణంలోని ఐటిసి కర్మాగరానికి, బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం కర్ర స్టాక్ పాయింట్ కి కర్రను తరలిస్తున్న కర్ర ట్రాక్టర్ యజమానులు తమ రవాణా ఖర్చులను మిగిల్చుకునేందుకు తీసుకురావలసిన లోడ్ కంటే రెట్టింపులోడును తీసుకు వస్తున్న సందర్భాలు భద్రాచలం, సారపాక పట్టణాల్లో ప్రజలకు, ప్రయాణికులకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మితిమీరిన లోడుకు తోడుగా కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి, మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను నడుపుతూ వస్తున్నట్లుగా విమర్శలు వినబడుతున్నాయి. స్టాక్ పాయింట్ల వద్దకు తీసుకు వెళ్ళవలసిన ట్రాక్టర్ లో ఉన్న కర్ర లోడు ఉండవలసిన ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు లోడు చేసుకుని తీసుకు వస్తున్నట్లు సమాచారం. స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్ లో ఉన్న లోడును మరొక ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేసుకుని స్టాక్ పాయింట్లలో అన్లోడ్ చేస్తున్నట్లు తెలియవస్తుంది. ఈ నేపథ్యంలో ఉండవలసిన లోడు కంటే రెట్టింపు తీసుకు వస్తున్నట్లు విమర్శలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్నాయి. ఇంచుమించుగా ఒక లారీకి చేయవలసిన లోను ఒక ట్రాక్టర్ కు మాత్రమే ఎక్కిస్తూ కొందరు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
– మరిన్ని ప్రమాదాలు జరిగితే గాని మేలుకోరా..?
గత మూడు నెలల కాలం వ్యవధిలోనే పదుల సంఖ్యలో కర్ర ట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతోమంది ట్రాక్టర్ డ్రైవర్లు మృతి చెందిన సంఘటనలు పాఠకులకు, అధికారులకు విధితమే. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కు కనీసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని పరిస్థితి కూడా లేకుండా ఇన్సూరెన్స్ లేని ట్రాక్టర్లు ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇంకా ఎన్ని ట్రాక్టర్లకు సరైన పత్రాలు, ఇన్సూరెన్సులు లేకుండా నడుస్తున్నాయో తెలియని పరిస్థితి. ఓవర్ లోడు వేసుకొని సుమారు 20 టన్నుల లోడుతో వస్తున్న కర్ర ట్రాక్టర్ డ్రైవర్ కు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని పరిస్థితులు కనిపిస్తూ అధికారులను వెక్కిరిస్తున్నాయి. మోడిఫికేషన్ చేసిన లైసెన్సులతో, సరైన పత్రాలు లేని, సరైన ఫిట్నెస్ లేని వాహనాలతో అధిక లోడును తరలిస్తూ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ట్రాక్టర్ల యజమానులపై అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకొని ఓవర్ లోడ్ సమస్యను నియంత్రించడంలో విఫలమవుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంతమంది అమాయకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరిగి, మరిన్ని కుటుంబాలు రోడ్డున పడితే తప్ప అధికారుల్లో చలనం రాదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.