అధిక ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్ కు బుద్ధి చెప్పాలి చండ్ర నరేంద్ర కుమార్. పేదల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు దారా దత్తం చేస్తున్న మోడీ. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 3, సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి, ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం సిపిఐ జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లతో రాస్తారోకో చేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నాను ఉద్దేశించి చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేసి, ధనవంతులు చేయటమే లక్ష్యంగా దేశంలో పరిపాలన సాగిస్తున్నారని, నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లే విధంగా చేస్తున్నారని, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, సాకుతో విచ్చలవిడిగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమ సత్తా ఏంటో చూపిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే నాగుల మీరా, సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, సిరిపురపూ వెంకటేశ్వర్లు, గుండె పిన్ని మధు, గార్లపాటి వీరభద్రం, ఎస్.కె చాంద్ పాషా, పగడాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
