మన్యం న్యూస్,ఇల్లందు టౌన్: ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కంటికి కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందావత్ రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కంటితుడుపుగా ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఆందోళన కలిగిస్తుందని రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వల్ల లక్షలాదిమంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, ఎంతో కష్టపడి లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగుల పరిస్తితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ సంఘటన ద్వారా వారు మరింత ఆందోళనకు గురవుతున్నారని డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇలా అడ్డదారులలో ఉద్యోగం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు దక్కటం లేదన్నారు. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించకూడదని తప్పకుండా వారిని శిక్షించాలని రమేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
