మన్యంన్యూస్ ఇల్లందు టౌన్ మార్చి 20:గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు వలన నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లెందులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహాసిల్దార్ కృష్ణవేణికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సూర్ణపాక నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ధర్నా స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రదర్శన బుగ్గవాగు బ్రిడ్జి, కొత్త బస్టాండ్,గోవింద్ సెంటర్ల మీదుగా తహాసిల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లాప్రధానకార్యదర్శి కందగట్ల సురేందర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావులు మాట్లాడుతూ..రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు గులాబీ తుఫానుతో నేలమట్టమై, తడిసి ముద్దయి చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు గుండెపై పిడుగు పడిన విధంగా ఈదురుగాలులు, రాళ్ల వర్షంతో పంటలు పూర్తిగా ధ్వంసం కావడంతో రైతులు తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. ఒకవైపు నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుమందులతో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి అప్పులతో సతమతమవుతుండగా మరోవైపున అకాల వర్షాలతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా రైతుల పరిస్థితి తయారైందని అన్నారు. పంటనష్ట పరిహారం చెల్లించాలని రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర సర్వే చేపించి పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల నష్టపరిహారం చెల్లించే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి కొక్కుసారంగపాణి, సర్పంచులు మోకాళ్ళ కృష్ణ, భానోత్ సంతు, వాంకుడోత్ సరోజన, చింత రజిత,వాంకుడోత్ శ్రీను,
అజ్మీర శంకర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,ఏఐకేఎంఎస్ మండల నాయకులు పూణెం కోటన్న,తొగరసామేల్, వాంకుడోత్ హర్జ, భూక్య మంగ్య, జోగా కాంతారావు, ఇరుప విజయ్,భూక్య మంగీలాల్, బానోతు తారచందు,పూణెం రాంబాబు,ఏనుగు రాంబాబు, బొర్ర బిక్షం తదితరులు పాల్గొన్నారు.