మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 20, మండల కేంద్రంలోని పడమట నర్సాపురం రైతు వేదికలో దొంగలు పడ్డ సంఘటన జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారి గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి రైతు వేదికలో దొంగలు పడి భూసార పరీక్షలు నిర్వహించే కిట్టును దొంగిలించారని తెలిపారు. ఈ విషయము పై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు నర్సాపురంలోనీ ఒక పాత ఇనప సామాను కొనే కొట్టును తనిఖీ చేయగా, వివిధ పార్టులుగా విడదీసిన పరికరం లభ్యమయింది. పరికరాన్ని ఎవరు అమ్మారని దుకాణదారున్ని పోలీసులు విచారించగా, ఇదే గ్రామానికి చెందిన గుడిమెట్ల సురేష్, బూరుగు ముత్యాలు అనే ఇద్దరు యువకులు, కేవలం 80 రూపాయలకు పరికరాన్ని విక్రయించినట్లుగా తెలిసింది. పరికరాన్ని, దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా ఏఈవో గోపికృష్ణ తెలిపారు. రైతు వేదిక గ్రామ శివారులో ఉండడం వల్ల, ఆఫీస్ రూములకు ఐరన్ గ్రిల్స్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల దొంగలు ఈజీగా విలువైన వస్తువులను దోచుకుంటున్నారని, ఇదే రైతు వేదికలో గత సంవత్సరం దొంగలు పడి, ధాన్యం కొనుగోలు కేంద్రానికి నిలువ ఉంచిన 50 టార్పోలిన్ పట్టాలు, ఆఫీసుకు సంబంధించిన కంప్యూటర్ ను దొంగిలించారని, ఆ సంఘటన మరువక ముందే మరల ఇలా జరగడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఏది జరిగిన స్థానిక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన క్రైమ్ న్యూస్ మీడియాకు సకాలంలో అందించకపోవడం బాధాకరం.
