- భద్రాచలంలో బరిలో బరాబర్ సిపిఎం పోటీ చేస్తది
- – వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి పోటీకి ఛాన్స్
- – బిజెపి బండారం బయట పెట్టేందుకే ప్రజా చైతన్య యాత్ర…
- – ప్రజా చైతన్య యాత్రకు అడుగును అనుహస్పందన
- – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మన్యం న్యూస్, భద్రాచలం , మార్చి 21
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం బరిలో సిపిఎం బరాబర్ పోటీ చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బిజెపి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ బిజెపి పలు ఎన్నికల్లో గెలుస్తూ వస్తోందని ఆయన తెలిపారు. బిజెపి పాలన దేశానికి సురక్షితం కాదని, బిజెపి మోసాలను ప్రజలకు చేర్చి, బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా సిపి(ఐ)ఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. బిజెపి హయాంలో దేశంలో సురక్షిత పాలన లేదనన్నారు. బిజెపిది దిగదిడుపు పాలనని వ్యాఖ్యానించారు. సెంటిమెంటుతో నిత్యం ప్రజలను బిజెపి మోసగిస్తూ ఉందని అన్నారు. బిజెపిని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బిజెపి విధానాలను ఎండ గడుతూ సిపి(ఐ)ఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు రాష్ట్రంలో విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు సాగిన ఈ చైతన్య యాత్రలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. టీ.ఎస్.పి.ఎస్సీ గ్రూప్ 1 పేపరు లీకేజ్ వ్యవహారంలో బాధ్యులు ఎంతమంది ఉన్నా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇంత భారీ లీకేజీ జరిగితే, అది ఒకరిద్దరి వల్లో సాధ్యం కాదని, గుమస్తాలను బాధ్యులుగా చూపి, అసలు కారకులను విడిచి పెట్టడం సరికాదని, లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి అసలు నేరస్తుల పేర్లు బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. భద్రాచలం అభివృద్ధికి సీఎం ప్రకటించిన వరాల పరిస్థితి ఏమిటి అని తమ్మినేని ప్రశ్నించారు. రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు ఏమయ్యాయి అని అడిగారు. భద్రాచలం అభివృద్ధికి వంద రూపాయలు కూడా కేటాయించకపోవడం సోచనీయము అని అన్నారు. తక్షణమే భద్రాచలం అభివృద్ధిని చేపట్టాలని కోరారు. భద్రాచలం కరకట్ట ఎత్తు పెంచాలని, ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణకు తీసుకురావాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాల బలాన్ని నిరూపిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తమ్మినేని వెల్లడించారు. బిజెపిని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉండటమే తమ పార్టీ ఉద్దేశం అన్నారు. పొత్తుల విషయం త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. భద్రాచలంలో సీపీ(ఐ)ఎం తప్పక పోటీ చేస్తుందని వెల్లడించారు. గతంలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడుసార్లు సిపిఎం అభ్యర్థులు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కుంజా బొజ్జి, సున్నం రాజయ్య ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన సేవలు అందించారని గుర్తు చేశారు. వారి సేవలు స్థానికుల్లో చిరస్మరణీయంగా మిగులుతాయని తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ… ఇప్పటివరకు సిపిఐఎం ప్రజా చైతన్య యాత్ర భద్రాచలం వరకు 400 కిలోమీటర్ల సాగిందని తెలిపారు. బిజెపి పాలన వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని తెలిపారు. దేశ ప్రజలను బిజెపి బడా మోసం చేస్తుందని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధిలో అందరూ మోసం చేశారని గుర్తు చేశారు.రామ జపం చేయటమే తప్ప,రాముని ప్రాంతం భద్రాచలానికి బిజెపి చేసింది ఏమీ లేదని తెలిపారు. విజ్ఞులైన ప్రజలు బిజెపి మోసాలను గుర్తించి, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగు బుద్ధి చెప్పాలని గుర్తు చేశారు. భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మీడియా బాబురావు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్ర విజయవంతంకు ప్రతి ఒక్కరు చేయాలని ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, ఎం.బీ.నర్సారెడ్డి, సిపిఎం భద్రాచలం మండల కార్యదర్శి గడ్డం స్వామి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, వై.వెంకటరామారావు, పి.సంతోష్, లీలావతి తదితరులు పాల్గొన్నారు.