మన్యం న్యూస్, మంగపేట.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం తెలుగు ప్రజల తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రైతుల జీవితాల్లో శోభన నింపాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.బుధవారం ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో హలం పట్టి పొలం దున్ని సాంప్రదాయబద్ధంగా ఏరువాక సాగారు. అనంతరం పొలంలో విత్తనాలు వెదజల్లారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ఏరువాక సాగటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు కుంటలు చెరువులు నిండుకుండల్లా ఉండి రెండు పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. పాడిపంట సమృద్ధిగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని సాంబశివరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో రైతే రాజ్యాన్ని నడిపే పరిస్థితులు రావాలని ఆ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగాది పర్వదినం రైతుల జీవితాల్లో కాంతిని తెచ్చినప్పుడే సార్థకత ఏర్పడుతుందన్నారు ఉగాది పర్వదినానికి రైతులకి ఎంతో అవినాభావ సంబంధం ఉందని సాంబశివరెడ్డి అన్నారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి సాంప్రదాయ బద్ధంగా పశుపూజ నిర్వహించారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చి పులుసు నరేశ్ కునాల్ స్థానిక రైతులు రాంపండు రాజు వెంకట్ రెడ్డి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.