- కేసీఆర్ పెద్ద మనసు
- బోనకల్ లో సీఎం పర్యటన
- పంటనష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేలు సాయం
- తక్షణమే రిలీజ్
- పర్యటనలో పాల్గొన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా
- – సీఎం పర్యటనలో సీపీఎం, సీపీఐ నేతలు తమ్మినేని, కూనంనేని
- – సీఎంతో కలిసి తుమ్మల ప్రయాణం
మన్యంన్యూస్ ప్రతినిధి, బోనకల్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పారు. నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలే తప్ప… నారాజ్ కారాదని అన్నారు. కౌలు రైతులను కూడా సమన్వయం చేసి వారికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు.
తుమ్మలకు స్పెషల్ ట్రీట్ మెంట్
సీఎం పర్యటన సందర్బంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్పెషల్ ట్రీట్ మెంట్ లభించింది. సీఎంను తుమ్మల కలవగా, తనతో పాటు మహబూబాబాద్ పర్యటనకు హెలికాప్టర్ లో సీఎం తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై, స్థానిక రైతుల స్థితిగతులు, సీతారామా ప్రాజెక్టుపై చర్చించారు.
బస్సులోనే లంచ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్సులోనే ఆయన ఆహారాన్ని స్వీకరించారు. షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయం వృథా కాకుండా ఆయన హెలిప్యాడ్ వద్ద బస్సులోనే భోంచేశారు. పులిహోర, పెరుగన్నం, అరటిపండును ఆయన తిన్నారు. బస్సులో ఉన్న నేతలకు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పులిహోరను వడ్డించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ సంతోష్, పలువురు నేతలు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సెక్రెటరీ టు సీఎం స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.