మన్యంన్యూస్,ఇల్లందుటౌన్ సీపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తునికాకు సమస్యను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని ఇల్లందులోని కామ్రేడ్ ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు
అధ్యక్షత వహించగా మీటింగ్ ను ఉద్దేశించి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు,అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్లు మాట్లాడుతూ… ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలకు రెండవ పంటగా తునికాకు జీవన ఉపాధిగా ఉంది.60డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్కచేయకుండా,తమ శ్రమ,శక్తిని ధారపోసి చెట్టు, చెట్టుకు తిరిగి ఆకు స్వేకరణ చేసే తునికాకు కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కటంలేదని, వారి శ్రమను చౌకగా కాంట్రాక్టుర్లు, ప్రభుత్వాలు కుమ్మక్కై దోచుకుతింటున్నాయన్నారు. ఆకు సేకరణ క్రమంలో పాము,తేలు, వణ్యమృగాల బారిన పడి ప్రతి యేటా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను ఆదుకునేనాధుడే కరువైనాడని ప్రభుత్వ, కాంట్రాక్టర్ల వ్యవస్థపై మండిపడ్డారు.
యుగాలు మారిన ఆదివాసీ,పేదల బ్రతుకులలో ఎలాంటి పురోగతిలేదని, చింతాకు మందం కూడా అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయమని అన్నారు.
అన్ లోడింగ్,కళ్ళేదారి కమిషన్ ఇతర పనులకు 30%శాతం ఇవ్వాలని,ఆకు సేకరణ క్రమంలో పాము,తేలు, వణ్యమృగాలు,వడదెబ్బ మొదలయిన వాటితో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేషీయా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తునికాకు కూలీల హక్కులను కాల రాస్తే రాబోయే కాలంలో పోరాటాలకు నాంది పలకాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సూర్నపాక నాగేశ్వరరావు, పీవైఎల్ జిల్లా నాయకులు మంగ్యా,జోగ కృష్ణ, వజ్జ మధు, ఏఐకేఎంఎస్ ఇల్లందు మండల అధ్యక్షులు కల్తి సీతారాములు, పీఓడబ్ల్యు జిల్లా నాయకురాలు కల్తి కోటమ్మ , మాణిక్యారం సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ, ఎల్లన్న నగర్ సర్పంచ్ సంతు, పోచారం సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.