UPDATES  

 పది పరీక్షలు రాస్తే గురుకుల విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలి..

మన్యం న్యూస్, భద్రాచలం :

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులపై సంబంధిత ప్రిన్సిపాల్ లు పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వారు పరీక్షలు సులభంగా రాసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ గురుకులం హైదరాబాద్ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆర్.సి.వొ, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లకు జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశించారు. సోమవారం హైదరాబాదు నుండి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశానుసారం సంబంధిత ఆర్సిఓలకు, ప్రిన్సిపాల్ లకు పాఠశాలల వారీగా సమీక్షిస్తూ వచ్చే నెల మూడో తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నందున విద్యార్థిని, విద్యార్థులకు సంబంధిత పరీక్ష సెంటర్లకు సకాలంలో చేరుకునే విధంగా రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. వారి వెంట ప్రత్యేకమైన అధికారిని పంపించాలని, పరీక్షలు కాగానే వారిని సురక్షితంగా సంబంధిత పాఠశాలలకు చేరే విధంగా చూడాలని అన్నారు. అదేవిధంగా వారికి పరీక్ష హాలులో మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ పాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, సిద్ధంగా ఉంచాలని ప్రతి పరీక్షా కేంద్రంలో మెడికల్ క్యాంపు ఉండే విధంగా చూసుకోవాలని, విద్యార్థిని, విద్యార్థులు ఎటువంటి భయాలు మనసులో పెట్టుకోకుండా పరీక్షలు సులభంగా రాసే విధంగా చూసే బాధ్యత సంబంధిత ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు చూసుకోవాలని అన్నారు. అలాగే స్పెషల్ ఎంసెట్ క్యాంపు నిర్వహించడానికి ఇప్పటి నుండే పాఠశాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని సంబంధిత ప్రిన్సిపాల్ లు విద్యార్థిని, విద్యార్థులు యొక్క జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియం ఐదో తరగతిలో ప్రవేశానికి వచ్చే నెల 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించే కేంద్రాలను సిద్ధం చేయాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించి, సంబంధిత ప్రిన్సిపాల్ లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని విద్యార్థినీ, విద్యార్థులను సంసిద్ధం చేయాలని అన్నారు. అనంతరం ఇన్చార్జి ఆర్.సి.ఓ గురుకులం డేవిడ్రాజు మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలకు విద్యార్థిని, విద్యార్థులను చేరవేయడానికి సంబంధిత ప్రిన్సిపాల్ లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, పిల్లలకు పరీక్ష కేంద్రాలకు తరలించడానికి బస్సులు, ఆటోరిక్షాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిల్లల వెంట ప్రత్యేక బాధ్యత గల అధికారిని పంపుతూ, పరీక్షా కేంద్రంలో అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. వచ్చే నెలలో జరిగే ఐదో తరగతి ఎంట్రన్స్ టెస్ట్ కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కేంద్రాలను గుర్తించామని ఆయన తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !