- నేడే రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
- – దక్షిణ అయోధ్యలో కిక్కిరిసిన భక్తకోటి
- – కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి
- – ఎస్పీ డా.వినీత్ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు
- – శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి పువ్వాడ
మన్యం న్యూస్, భద్రాచలం :
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్తకోటి నడుమ, రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరగనున్నది. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాక భారతదేశం లోని పలు ప్రాంతాల నుండి ఇప్పటికే వేలాదిగా భక్తులు భద్రాచలం చేరుకొని రామయ్య కళ్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయేందుకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు తిలకించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు ముందుగానే పూర్తి చేసి ఉన్నారు.
– కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నేడు కన్నుల పండుగగా జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. విభాగాల వారీగా అధికారులను కేటాయించి వారి వారి విభాగాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసి ఉన్నారు. రామయ్య కళ్యాణం జరుగునున్న మిథిలా స్టేడియంలో విఐపి సెక్టార్లు, ఇతర సెక్టార్లలో కావలసిన ఏర్పాట్లను చూసుకునేందుకు ప్రతి సెక్టార్కు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సెక్టార్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సెక్టార్ ప్రత్యేక అధికారి పై ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. సెక్టార్ ఇన్చార్జులుగా విధులు నిర్వహించు సిబ్బంది ఉదయం 5 గంటలకు కేటాయించిన సెక్టారులకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. అంతేగాక గోదావరి పరివాహక ప్రాంతంలో సైతం పుణ్య స్థానాలు నిర్వహించడానికి విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో పకడ్బందీగా పూర్తి చేసి ఉన్నారు. వైద్య సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది లతోపాటు ఇతర శాఖల అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శ్రీ సీతారాముల తిరుకల్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలను పూర్తిచేసేందుకు అధికారుల పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
– ఎస్పీ డా.వినీత్ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న శ్రీ సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేకం మహోత్సవం లను వీక్షించేందుకు దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం చేరుకుంటున్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం విచ్చేసి భక్తులకు వారి వారి వాహనాలు నిలుపుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వెహికల్ పార్కింగ్ సెక్టార్లను ఇప్పటికే సంసిద్ధం చేసి ఉంచారు. రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు పలువురు మంత్రులు, ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రోటోకాల్ పరంగా, భద్రాచలం విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే భద్రాచలం పట్టణంలో పోలీసు బలగాలు విధులు నిర్వర్తిస్తున్నారు. రామాలయానికి చేరుకునే పలుమార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ భారీ కేట్లను ఏర్పాటు చేసి అనుమతి లేని వాహనాలను పార్కింగ్ సెంటర్లకు తరలించాలని జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేసి ఉన్నారు.
– భక్తులకు ప్రత్యేక సౌకర్యముల వివరములు
శ్రీరామనవమి సందర్భముగా పర్ణశాల వెళ్లే భక్తుల కొరకు భద్రాచలం బస్టాండు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు. రైలులో భద్రాచలం వచ్చే ప్రయాణికులు విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్లు రూటులో ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి బస్సులో భద్రాచలం రావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. ఖమ్మం నుండి భద్రాచలంనకు 120 కి.మీ. దూరం ఉంటుంది. భద్రాచలం రోడ్ ( కొత్తగూడెం ) రాత్రి 10.30 గంటలకు సికింద్రాబాద్కు రైలు సౌకర్యం కలదు. భద్రాచలం నుండి కొత్తగూడెం 40 కి.మీ. దూరం ఉన్నది.
1. పార్కింగ్ ప్రదేశములు : – ( 1 ) మార్కెట్ యార్డు ( చర్ల రోడ్ ) , ( 2 ) జూనియర్ కాలేజి మైదానం ఐ.టి.డి.ఎ. రోడ్, ( 3 ) గోదావరి బ్రిడ్జి ప్రక్కన మెయిన్ రోడ్, ( 4 ) మిథిలా స్టేడియం వెనుక ( వి.ఐ.పి పార్కింగ్ ), ( 5 ) ఆర్ & బి ఆఫీస్ స్థలం
2. సమాచార కేంద్రాలు : – కొత్తగూడెం బస్టాండ్ , కొత్తగూడెం రైల్వే స్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్ గేట్, మార్కెట్ యార్డు, విస్తా కాంప్లెక్సు, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాతగుడి సెంటర్, డిగ్రీ కళాశాల ( కూనవరం రోడ్ ), ఆర్టీఓ కార్యాలయం (కూనవరం రోడ్), కూరగాయల మార్కెట్ చర్ల రోడ్, యుబి రోడ్, ఐటిడిఏ రోడ్డు, జూనియర్ కళాశాల మైదానం, స్నానాల ఘాట్ ( గోదావరి ), బిఈడి కళాశాల, అంబేద్కర్ సెంటర్, ఎలసి కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కళ్యాణ మండపం, సాధువుల మండపం ఆంజనేయస్వామి విగ్రహము వద్ద, ఆర్టీసి బస్టాండ్ ఆవరణ, తానీషా కళ్యాణ మండపం వద్ద, మార్కెట్ యార్డు నందు
3. ప్రసాదము కౌంటర్లు : –
కోర్టు ఏరియాలో, స్టీమర్ రోడ్ (కళ్యాణ మండపం వెనుక వైపు పార్కింగ్ ప్రదేశము వద్ద, రామానిలయం, సీతా నిలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక క్యూలైన్ వద్ద, పడమట క్యూ లైను వద్ద, ఆర్.టి.సి. బస్టాండ్, మార్కెట్ యార్డ్
తలంబ్రాలు పంపిణీ కౌంటర్లు : – స్టీమర్ రోడ్ కళ్యాణ మండపం వెనుక వైపు పార్కింగ్ ప్రదేశము వద్ద , విస్తా కాంప్లెక్స్ వద్ద, ఆర్.టి.సి. బస్టాండ్ వద్ద, కోర్టు ఏరియా , మార్కెట్ యార్డ్, కాలేజీ గ్రౌండ్, శ్రీ ఆంజనేయ స్వామి వారి పార్కింగ్ ఏరియా, బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆర్టీసి ద్వారా ఉచిత తలంబ్రాలు పంపిణీ జరుగుతుంది భక్తులు గమనించగలరు.
భక్తులకు ఉచిత భోజనశాల : – దేవస్థాన అన్నదాన సత్రంతో పాటుగా, అయ్యప్ప స్వామి దేవాలయం, తాతగుడి సెంటర్లని సాయిబాబా గుడి టెంపుల్, క్షత్రియ అన్నదాన సత్రం, ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం, అంబా సత్రం
ప్రాథమిక చికిత్స కేంద్రాలు : – ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, ఆర్.టి.సి. బస్టాండ్, గోదావరి ఘాట్ నందు, కళ్యాణ మండపం వద్ద, విస్తా కాంప్లెక్స్ నందు, కూనవరం నందు, వసతి సౌకర్యాల వద్ద
త్రాగునీరు : – పట్టణంలోని అన్ని ప్రధాన కూడలిలోను డ్రమ్ముల ద్వారా చల్లని మంచినీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
అత్యవసర చికిత్సా కేంద్రాలు :
కొత్తగూడెం బస్టాండ్, కొత్తగూడెం రైల్వే స్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్ గేట్, మార్కెట్ యార్డు, విస్తా కాంప్లెక్సు, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాతగుడి సెంటర్, డిగ్రీ కళాశాల (కూనవరం రోడ్), ఆర్టీఓ కార్యాలయం (కూనవరం రోడ్) కూరగాయల మార్కెట్, చర్ల రోడ్, యుబి రోడ్, ఐటిడిఏ రోడ్డు, జూనియర్ కళాశాల మైదానం, స్నానాల ఘాట్ ( గోదావరి ), బిఈడి కళాశాల, అంబేద్కర్ సెంటర్, ఎలసి కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కళ్యాణ మండపం, సాధువుల మండపం ఆంజనేయస్వామి విగ్రహము వద్ద, ఆర్టీసి బస్టాండ్ ఆవరణ, విస్తా కాంప్లెక్స్, కళ్యాణమండపం ఎదురుగా , తానీషా కళ్యాణ మండపం వద్ద