- మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు.
- భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.
- రామనామ స్మరణతో మార్మోగిన పల్లెలు.
- నవమి వేడుకలకు హాజరై న ప్రముఖులు.
మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 30, శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మండల వ్యాప్తంగా పల్లెల్లో సీతారామ కళ్యాణ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో చలువ పందిళ్ళ కింద మండపాలలో ఏర్పాటుచేసిన, సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఆలయ పూజారుల మంత్రోచ్ఛరణ, భక్తుల రామనామ స్మరణతో పల్లెలన్నీ మార్మోగాయి. పాపకొల్లు, జూలూరుపాడు గ్రామాలలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులతో కలిసి వీక్షించారు. వెంగన్నపాలెం, జూలూరుపాడు గ్రామాలలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పొంగులేటి అభ్యర్థి బానోత్ విజయబాయి, ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి పాల్గొని భక్తులతో కలసి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం విజయ బాయి వెంకటరెడ్డి తో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు, మహిళలు, చిన్నారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.