- జయ జయ ద్వానాల నడుమ జగదభి రాముని కళ్యాణం
- – శ్రీ సీతారాములకు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి
- – రామయ్య కళ్యాణానికి హాజరైన ఎంపీ మాలోత్ కవిత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, చిన్న జీయర్ స్వామి
- – నేడు శ్రీ స్వామివారికి మహా పట్టాభిషేకం
- – నేడు భద్రాచలం రానున్న గవర్నర్ తమిళ సై
మన్యం న్యూస్, భద్రాచలం :
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం నందు గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగింది. పట్టణంలోని మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన కళ్యాణ మండపంలో భక్తకోటి జయ జయ ద్వారాలు నడుమ జగదభి రామని కళ్యాణం వేడుకను తిలకించి భక్తులు పరవశించిపోయారు. ఉదయం నుంచి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అభిజిత్ లగ్నం నందు లోకపావని శ్రీ సీతాదేవి మెడలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చేతుల మీదుగా మంగళ ధారణ చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ దేవాలయ శాఖ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి శ్రీ సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్తాలను అందజేశారు. చిన్న జీయర్ స్వామి, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పొదెం వీరయ్య తదితర ప్రముఖులు శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించి పరవశించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీరామనవమి శ్రీ సీతరామచంద్రులు కళ్యాణం విశిష్టతను, ఆలయ చరిత్రను, ఆలయ వైభవాన్ని భక్తులకు వివరిస్తూ కల్యాణ క్రతువును నడిపించారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. భద్రాచలం పట్టణంలోని ఏర్పాటుచేసిన శ్రీ స్వామివారి తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తులు ఉచితంగా అందజేస్తున్న స్వామివారి తలంబ్రాలను తీసుకున్నారు. పట్టణంలోని పలువురు వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి వివిధ ప్రాంతాల నుండి భద్రాచలం వచ్చిన భక్తులకు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారాలు అందజేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పహారా కాశారు. ఎక్కడికక్కడ వాహనాలను పార్కింగ్ ఏరియాలకు తరలిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
– నేడే శ్రీ స్వామివారి మహా పట్టాభిషేకం
భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వరి దేవస్థానం నందు నేడు శ్రీ స్వామివారికి మహా పట్టాభిషేకం మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ హాజరుకానున్నారు.