మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఎంతో వైభవంగా కన్నుల పండుగ జరుపుకునే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సత్యనారాయణ పురం దర్గా షరీఫ్ నందు దర్గా ఆస్థాన కమిటీ మాలికులు ఘనంగా నిర్వహించారు. సీతారాముల వివాహ మహోత్సవం అనంతరం మర్నాడు జరిగే శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీరామ పట్టాభిషేకాన్ని కనులారా వీక్షించారు.ఈ సందర్భంగా భానోత్ హరిప్రియ మాట్లాడుతూ…. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సత్యనారాయణపురం ఉర్సు దర్గా షరీఫ్ నందు సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని నెలకొల్పటంతో పాటు ప్రతి ఏటా శ్రీ రామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపించడం అనేది గొప్ప విషయం అన్నారు. కులమత బేధాలు లేకుండా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించటం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారతదేశం సర్వమత సమ్మేళనం అని ఎంతో గొప్పగా చెప్పుకునే మనం.. ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణం నందు గల సత్యనారాయణపురం దర్గా షరీఫ్ నందు ప్రత్యక్షంగా చూస్తున్నామని అందుకు ఇల్లందు పట్టణ ప్రజలు ఎంతో అదృష్టవంతులని హరిప్రియ అన్నారు.నియోజకవర్గ ప్రజలందరిపై రాములవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా రైతుబంధు సభ్యులు పులిగండ్ల మాధవరావు, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఒకటో వార్డు కౌన్సిలర్ వార రవి, నాయకులు ఎలమందల వాసు, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష, యువజన నాయకులు సుమన్, రాకేష్, అభి, పాల్గొన్నారు.