మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 31: ఆదివాసి భూములను కబ్జా చేస్తున్న వారిని వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెడతామని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, బహుజన సమాజ్ పార్టీ పినపాక నియోజకవర్గ ఇంచార్జ్ అలెం కోటిలు అన్నారు. వారు శుక్రవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పూనెం సింగయ్య వారసులకు మద్దతునిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని సమితి సింగారం గ్రామంలో హైకోర్టు డబ్ల్యూ పి నెంబర్ 26706/2022, జిల్లా కలెక్టర్ ఆర్సీ నెంబర్ ఈ 3/5535/2021 ప్రకారంగా సర్వే నెంబర్ 314/115 విస్తీర్ణం 5 ఎకరాల పట్టాదారు పూనెం సింగయ్య పట్టా భూమిని అక్రమంగా పట్టా చేయిచుకున్న వారిపై కేసులు నమోదుచేసి ఆ భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా వెంచర్లను వెంటనే సీజ్ చేయాలన్నారు. అధికార పార్టీ వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆదివాసి భూములను బినామీల పేరిట పట్టాలు చేయించుకుని వెంచర్లు వేస్తున్నారని, సింగయ్య భూమిని తక్షణమే వారి వారసులకు పంపిణి చేయాలని, లేని పక్షంలో రెవిన్యూ అధికారులపై ఉన్నత న్యాయస్థానంలో కోర్టు దిక్కరణ కింద కేసులు వేస్తామన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని దశలవారీగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మణుగూరు మండల అధ్యక్షులు వాగబోయిన శ్రీను, సోలం వెంకటరమణ, పూనెం పద్మ,కుంజా కన్నయ్య, పాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.