మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
శ్రీరామనవమి సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి, భద్రాచలం లో రద్దీని తట్టుకోవడానికి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రాచలంలో శ్రీరామ నవమి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాలకు రెండు రోజులుగా దేశం నలుమూలల నుంచి లక్ష మందికిపైగా తరలివచ్చి ప్రత్యక్షంగా వేడుకలను తిలకించారన్నారు.
జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భద్రత, పారిశుధ్యం ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
శ్రీరామ నవమి ఎంతో ప్రశాంత వాతావరణంలో జరిగిందని, దీనిని విజయవంతం చేయడానికి నిర్విరామంగా కృషి చేసిన అన్ని శాఖలకు జిల్లా అధికార యంత్రాంగం కృతజ్ఞతలు తెలియజేశారు.
పంచాయితీరాజ్, మిషన్ భగీరథ, ఎన్పిడిసిఎల్, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పోలీస్, ఎండోమెంట్ ఇతర శాఖల చురుకైన భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. వేలాదిమంది ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యపడిందని హర్షం వ్యక్తం చేశారు.
ఉత్సవాల ప్రాంగణాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం , క్రిమిసంహారకం చేయడం, పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భక్తులు ఎంతో సంతృప్తి ని వ్యక్తం చేశారు.
భక్తుల భద్రత విషయంలో పోలీసు శాఖ ఎక్కడా రాజీ పడకుండా భద్రాచలం నలువైపులా పెద్దఎత్తున మోహరించి ఎలాంటి చిన్న సంఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని అన్నారు.గతంలో కంటే చాలా మెరుగ్గా భక్తులకు ఉత్తమమైన అనుభూతిని, సంతృప్తిని అందించడంలో జిల్లా యంత్రాంగం నిబద్ధతతో కృషిచేయడం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ విజయం ఒక స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి విచ్చేసి విజయవంతం చేసిన భక్తులందరికీ జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అన్ని విభాగాలు, సాంఘిక సంస్థలు, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు
సహకరించిన వ్యక్తులు అందరికి జిల్లా కలెక్టర్ అనుదీప్ కృతజ్ఞతలు తెలిపారు.