- గాలివాన బీభత్సవం.
- నేల కూలిన భారీ వృక్షాలు.
- తెగిపడిన కరెంటు వైర్లు.
- గ్రామాల నడుమ రాకపోకలకు అంతరాయం.
- కల్లాలలో తడిసిన మిర్చి.
- నేలకొరిగిన మొక్కజొన్న పైరు.
మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 31, మండలంలో శుక్రవారం అకాల భారీ గాలివాన బీభత్సవం సృష్టించింది. భారీ గాలులు బలంగా వీచడంతో భారీ వృక్షాలు నేల కూలి రోడ్లపై అడ్డంగా పడ్డాయి. దీంతో నర్సాపురం, కాకర్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. భారీ వృక్షం ద్విచక్ర వాహనంపై పడడంతో నర్సాపురం గ్రామానికి చెందిన మాలోత్ బాబురావు అనే రైతు ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. అకాల వర్షంతో రైతులు కల్లాలలో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. గాలివాన బీభత్సవానికి మండలంలో పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాయిరాం తండా గ్రామానికి చెందిన రైతు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమయింది. ప్రభుత్వాలు, అధికారులు రైతులను చిన్న చూపు చూస్తూ, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతుంటే, ఆఖరికి పకృతి సైతం రైతులపై పగ పట్టినట్టు పంటలను ధ్వంసం చేస్తూ, కన్నీటిని మిగుల్చుతుందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.