మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 31: మండల పరిధిలోని గానుగపాడు గ్రామపంచాయతీలో మద్యం మత్తులో అన్నదమ్ములు ఘర్షణపడి తమ్ముడు చెవుల రామారావు మృతి(32), అన్న చెవుల కృష్ణార్జున రావు (35)పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో అన్నదమ్ములు గతంలో రెండు,మూడు సార్లు ఘర్షణ పడ్డ సంఘటనలు ఉన్నాయని,ఈ సంఘటన వాళ్ల మిరప తోట కళ్ళం కాడ అన్న కృష్ణారావు కర్రతో తమ్ముడు రామారావు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందిన విషయం అన్న కృష్ణార్జునరావు కు తెలియడంతో భయంతో కృష్ణార్జున రావు సుజాతనగర్ లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆయనను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య మల్లేశ్వరి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, సీఐ వసంత కుమార్,డిఎస్పి రెహమాన్ సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.