పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
– సుమారు 150 ఐరన్ పైపులు పట్టివేత
– చకచక్యంగా వ్యవహరించిన ఎస్సై పి.సంతోష్
– సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన సిఐ నాగరాజు
మన్యం న్యూస్, సారపాక..
నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం రాత్రి సమయంలో బూర్గంపాడు ఎస్ఐ పి సంతోష్ కుమార్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ఆ గ్రామంలోని దర్గా ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గమనించిన ఎస్ఐ పి.సంతోష్ కుమార్ వారిని విచారించేందుకు వెంబడించగా అక్కడి నుంచి పరారయ్యారు. కాగా ఘటనా స్థలంలో సుమారు 150 ఐరన్ పైపులు, ఒక రేడియో, ఒక వీడియో కెమెరా, ఒక హెచ్ ఎస్ ఎఫ్ సెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పాల్వంచ సీఐ నాగరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, పేలుడు పదార్థాలను, ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి పేలుడు పదార్థాలను పట్టుకున్న ఎస్ఐ పి.సంతోష్ కుమార్ ని, సిబ్బందిని పాల్వంచ సీఐ నాగరాజు అభినందించారు.