- లోను ఇప్పిస్తానని డబ్బులు కాజేసిన మాయగాడు
– రూ.90 వేలు కాజేసి పరార్
– న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు
మనం న్యూస్, సారపాక
మోసగాళ్లు మాయమాటలు చెబుతూ ప్రలోభాలకు గురి చేస్తూ అమాయకులను టార్గెట్ చేస్తూ వారి దగ్గర డబ్బులు గుంజి ముఖం చాటేస్తూ పరారైన ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని కటకటాల పాలు చేసిన ఘటనలు కూడా చాలా జరిగాయి. అయినా కానీ ఎక్కడో ఒకచోట అమాయకులను మోసం చేస్తూ మాయగాళ్లు తమ పబ్బం గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది . ఇటువంటి సంఘటన ఇటీవల బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగింది. సారపాక గ్రామం బసప్ప క్యాంపుకు చెందిన వల్లెపు జమాల్ రావు అనే వ్యక్తిని సారపాక గ్రామంకి చెందిన వియ్యపు సతీష్ అనే కేటుగాడు తనకు బ్యాంకు ద్వారా 4 లక్షల లోను ఇప్పిస్తానని మోసం చేసి సుమారు 90,000 రూపాయలు వసూలు చేసి ప్రస్తుతం కనబడకుండా పోయిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మంగళవారం విలేకరుల సమావేశంలో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని, తనలాగా వేరొకరు మోసపోవద్దని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంవత్సరన్నర క్రితం బ్యాంకులోను ఇప్పిస్తానని తన వద్ద నుండి పలుమార్లు డబ్బులు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న అతడికి కఠిన శిక్ష విధించాలని, మరొకరికి ఇటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని బాధితుడు కోరుకున్నాడు.