- జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ‘ప్రజా పోరు’ ప్రజాపోరు యాత్రలకు ప్రజలు దండుగా కదలాలి
- ఏప్రిల్ 14 నుంచి తొలి దఫా యాత్రలు
- మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, ఖనిజ, అటవీ సంపద విస్తారంగా ఉన్న భద్రాది కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై పాలకులను నిలదీసేందుకే ప్రజా పోరు యాత్రలు చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎకె.సాబీర్ పాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీతారామా ప్రాజెక్టు, బిటిపిఎస్, బొగ్గు, ఇసుక నిక్షేపాలు విస్తారంగా ఉన్నప్పటికి ఇక్కడి ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, భద్రాది జిల్లా కేవలం ఉత్పత్తి కేంద్రంగానే పాలకులు ఉపయోగించుకుంటూ వివక్షత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దేశ సమగ్రత, సమైక్యతకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పాలకుల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ జిల్లా వ్యాపితంగా పల్లెపల్లెకు, ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జూన్ 10వరకు మూడు దఫాలుగా చేపడుతున్నామని, తొలిదఫా యాత్రలు అన్ని మండలాలు, పట్టణాలను కలుపుతూ ఏప్రిల్ 14 నుంచి చేపడుతున్నామని తెలిపారు. ప్రధానంగా సాగులో ఉన్న పోడు రైతులకు హక్కు పత్రాలు, నూతన భూగర్భగనులు, పేదలకు గృహ వసతి, సంక్షేమ పథకాల అమలు, రైతాంగ సమస్యలు, సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు, స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు, పనిభద్రత కల్పించాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటి వంటి విభజన హామీల్లోని అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలవైపు నడిపించేందుకు యాత్రలు చేపడుతున్నామని తెలిపారు. తొలిదఫా ఏడు రోజులపాటు ఏడు కేంద్రాల్లో ప్రారంభమయ్యే యాత్రలు, 28 బహిరంగ సభలకు, ముగింపు సభలకు సిపిఐ జిల్లా కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐజేయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, హాజరవుతారని తెలిపారు. వారంరోజుల యాత్రలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలాల కార్యదర్శులు, ప్రజా సంఘాల భాద్యలు రెండు వందల మంది నిర్విరామంగా పాల్గొంటారని తెలిపారు. యాత్రలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, జిల్లా నాయకులు కళ్లెం సత్యనారాయణ, మాతంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.