అన్నార్తులకు, అభాగ్యులకు ఆపన్నహస్తం అందించే నేత వృత్తి భోధన, ప్రవృత్తి సామాజికసేవ సమాజసేవలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైనం బడుగు,బలహీనవర్గాలఆశాజ్యోతి హతీరాంనాయక్ మన్యంన్యూస్,ఇల్లందు.. :తరగతి గది ఒక ప్రసూతి గది వంటిది జ్ఞానానికి జన్మనిచ్చేందుకు తోడ్పడుతుంది. తరగతి గది శ్మశానవాటిక లాంటిది అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు సహాయం చేస్తుంది. తరగతి గది కర్మాగారం వలె జాతి భవితను నిర్మించేందుకు కృషి చేస్తుంది. న్యాయస్థానం వలె సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడి ఊతమిస్తుంది. అదేవిధంగా పాఠాలతో పాటు ఉపాధ్యాయుడు బోధించే సారాంశం సబ్జెక్టుతో సంబంధం లేకుండా విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వాక్కుకు అంతటి అమితమైన శక్తి ఉపాధ్యాయునికి సొంతం. ప్రచారం తప్ప సేవ లేని ప్రస్తుతరోజుల్లో తమ స్థాయికి మించి సమాజసేవ చేస్తూ బయట ప్రచారం చేసుకోకుండా ఉండే కొద్దిమంది నాయకుల్లో భాజపా టీచర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంక్షేమసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హతీరాం నాయక్ ఒకరు. అటువంటి మహోన్నత ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న హతీరాంనాయక్ బొమ్మనపల్లిలో గిరిజన లంబాడా కుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యను పాల్వంచలోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదువుకుని ఆపై చదువులను కూడా జిల్లాలోనే పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ తర్వాత బీటెక్ చదివినప్పటికీ పలు కారణాల వలన మధ్యలోనే వదిలేశారు. అనంతరం డీఎస్సీ రాసి 2003లో గొప్యాతండాలో ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేసిన ఆయన అక్కడిప్రజల, తోటి ఉపాధ్యాయుల మన్ననలు అందుకొన్నారు. ఒకపక్క పాఠాలు భోదిస్తూనే బీఎస్సీ బీఈడీ పూర్తిచేసి పదోన్నతికై ఎదురుచూస్తున్నారు. హతీరామ్ నాయక్ కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే ఆయన తండ్రి, తాతలు అందరూ బొమ్మనపల్లి సర్పంచ్ గా దశాబ్దాలపాటు కొనసాగి, ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగానూ పేదలకు అండాగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో తండ్రి, తాతలలోని రాజనీతిజ్ఞతకు, సేవాతత్పరతకు ఆకర్షితుడైన హతీరాంనాయక్ ఉపాద్యాయవృత్తిలో కొనసాగుతూనే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. టేకులపల్లి యూపీఎస్ జండాలతండా ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తూనే కరోనా సమయంలో వలసకూలీలకు అన్నదానం కార్యక్రమాలను నిర్వహించటం, విద్యార్థుల చదువులకు సాయం చేయటం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ వారి శిక్షణకు అవసరమయ్యే డబ్బును అందించటం, అనాథలకు, అభాగ్యులకు, యాచకులకు భోజనాన్ని అందించారు. ఇవేకాకుండా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు చేరువయ్యారు. ప్రధానమంత్రి ఉజ్వలయోజన పథకం కింద 10 వేలకు పైగా గ్యాస్ కనెక్షన్లు నిరుపేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందేలా హతీరామ్ నాయక్ ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా, కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్, ముద్ర, సుకన్య సమృద్ది యోజన పథకాలు, ధరణీ పోర్టల్ మరియు పోడు భూముల సమస్యలపై ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి, పేదలకు లబ్ది చేకూరి వారికి వర్తించేలా విశేషకృషి చేశారు. ఇప్పటివరకు హతీరామ్ నాయక్ చేసిన అనేక కార్యక్రమాల ద్వారా దాదాపు 25 వేలమంది వరకు పేదప్రజలు లబ్ది పొందారంటే ఆయన చేసిన సేవలు ఎంతటి ఘనమైనవో అర్దం చేసుకోవచ్చు. ఈ సేవలకు గానూ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న హతీరాంనాయక్ సేవలను గుర్తించి ఇండియన్ సిటిజెన్ కౌన్సిల్ మధర్ థెరిస్సా సేవా రాష్ట్రస్థాయి అవార్డ్, నేషనల్ పీస్ డే అవార్డులను ప్రధానం చేశారు. ఇవిగాక మరెన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. ఇల్లందు నియోజకవర్గమే కాకుండా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ గుళ్లవద్ద ఉండే యాచకులకు, మతిస్థిమితం కోల్పోయిన వారికి భోజన, వసతి ఏర్పాట్లు కల్పించారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునే స్తోమత లేకుండా ఉన్న వందలాది పేదలకు సొంతఖర్చుతో పేరున్న వైద్యశాలలో చేర్పించి మెరుగైన వైద్య సేవలందించారు. కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే అక్కడ ప్రత్యక్షమై తనకు తోచిన సాయం చేయడం హతీరామ్ నైజం.ఇదే ఆయనను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునెలా చేసింది. ఒకవైపు నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తన సేవలందిస్తున్న హతీరామ్ నాయక్ పై భాజపా దృష్టిపడింది. ఏ పదవి లేకుండానే ఎన్నో సేవలందించిన హతీరాంనాయక్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడితే ఇల్లందు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధిపథంలో నడిపిస్తారు అని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
