మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 15
మతసామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతీకని,భిన్న మతాల, భిన్న జాతుల,భిన్న కులాల సమైక్య జీవన సౌందర్యం భారతదేశమని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు.తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ శుక్రవారం రాత్రి బొంబాయి కాలనీ మహమ్మదీయ మజీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఏరియా జిఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ రవూఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిఎం మాట్లాడుతూ,ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షను నిర్వహిస్తారని,ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ ఉపవాసాలు ఎంతో ఉపయోగకరం అన్నారు. అలాగే ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ,పరమత సహనంతో పరస్పరం సహకరించుకుంటూ,అన్నదమ్ముల కలసి మెలిసి ఉండటమే భారతీయుల గొప్పతనం అని ఆయన అన్నారు.మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,తల్లి పాదాల చెంతనే స్వర్గం ఉందని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత,తమ వారసులది అన్నారు.తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ,ఎన్నో ఏండ్లుగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం,కొనసాగిస్తున్నామని సింగరేణి ముస్లిం ఉద్యోగ సోదరులు సంఘానికి గుండెకాయ లాంటి వారని, వారికి ఏ కష్టం వచ్చినా తమ సంఘం అండగా ఉంటుందని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముస్లిం సోదరుల ఉన్నతికి,విద్యార్థుల విద్యాభివృద్ధికి వారి పురోగతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, సింగరేణి ముస్లిం ఉద్యోగులకు రంజాన్ పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించారని,ముస్లింలపై తమ ముఖ్యమంత్రి కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అన్నారు.ఒక మతతత్వ పార్టీ,దేశ ప్రజలను విభజించు,పాలించు పాలసీతో “జనాలను రెచ్చగొట్టు ఓట్లను రాబట్టు” అనే నినాదంతో మైనార్టీలను లక్ష్యం చేసుకొని ముందుకు వస్తోందని మైనార్టీ సోదరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ నేపథ్యం లో హిందూ,ముస్లిం,క్రిస్టియన్ సోదరుల ఐక్యతకు వారిలో అభద్రతాభావాన్ని పోగొట్టేందుకు తమ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం పండ్లు,సేమియా విందుతో ఇఫ్తార్ విందు ముగిసింది.ఈ సందర్భంగా ఆత్మీయ అలింగనం కార్యక్రమం కూడా నిర్వహించారు.టీబీజీకేఎస్ నాయకులు దాసి వీరభద్రయ్య వందన సమర్పణ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు,టీబీజీకేఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.