మన్యంన్యూస్,ఇల్లందు టౌన్:దేశ సమగ్రత, సమైక్యత కోసం, ప్రభుత్వ హామీల అమలుకై, జిల్లా సమగ్రాభివృద్దే లక్ష్యంగా సీపీఐ తలపెట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారం ఇల్లందుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుండాల, కొమరారం మీదుగా సాగిన ప్రజాపోరు యాత్ర రొంపేడు నుంచి ఐదువందల బైకులతో భారీ ర్యాలీగా ఇల్లందుకు చేరుకుంది. సీపీఎం పార్టీ నాయకులు నబీ ఈ యాత్రకు మద్దతు తెలిపారు. భాజపా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ యాత్రకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనమేరకు బీఆర్ఎస్ పట్టణ, మండల నాయకులు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కాంక్షిస్తూ ఈనెల 14న ప్రారంభమైన సిపిఐ ప్రజాపోరు యాత్ర నాలుగో రోజు ఇల్లందు చేరుకున్న తరుణంలో 24, 21 ఏరియా, ఇల్లందు ప్రధాన రహదారులు ఎరుపెక్కాయి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజాపోరు యాత్రకు రొంపెడులో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి దేవరకొండ శంకర్ అధ్యక్షతన స్థానిక జగదంబ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రజాపోరు యాత్ర రథసారథి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం బిజెపి హటావో దేశ్ కి బచావో నినాదంతో దేశవ్యాప్తంగా సిపిఐ చేపడుతున్న ఈ యాత్ర స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య మతం అంటూ విద్వేషాలు సృష్టించి అల్లర్లకు దారితీస్తున్నారని, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వాళ్ళని సంపన్నులుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నారని ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దెదింపడమే లక్ష్యంగా జాతీయస్థాయిలో సిపిఐ చేస్తున్న ప్రజాపొరు యాత్రకు జనంనుంచి విశేష ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా రోళ్ళపాడు ప్రాజెక్టును, అందుకు అవసరమైన నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అర్హులైన నిరుపేదలకు ఇంటినిర్మాణం కోసం ఆరులక్షల రూపాయలు మంజూరు చేయాలని, అంతేకాకుండా 21 ఓసి ద్వారా నిర్వాసితులు అవుతున్న ఆ ప్రాంత ప్రజలకు వేరేచోట ఇల్లు నిర్మించి వారికి సరైన ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. ఇల్లందుని రెవెన్యూ డివిజన్ చేయాలని, అదేవిధంగా కొమరారం, బొడు, సుదిమళ్ళ మండలాలుగా ప్రకటించాలని ఈ ప్రాంతాలలో అపారమైన ఖనిజ సంపదను ఉపయోగించుకొని ఇల్లందు నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, పేదలందరికీ ఆరోగ్య భీమా కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందించాలని ఈ పోరుయాత్ర సభ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికులకు సమనపనికి సమానవేతనం చెల్లించాలని అన్నారు. డబ్బుకు తావులేని నిస్వార్థ రాజకీయం కేవలం సీపీఐ పార్టీతోనే సాధ్యమని, రానున్న రెండేళ్లలో సీపీఐ పార్టీ వంద ఏళ్లు పూర్తిచేసుకుందని దేశంలో వందెళ్లకు దగ్గరలో ఏ ఒక్క పార్టీ లేదని పేర్కొన్నారు. ఇదంతా సీపీఐ పార్టీకి పునాది అయిన కార్యకర్తల వల్లే సాధ్యమైందన్నారు.బీజీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా సీపీఐ పార్టీతో కలిసివచ్చే ఏ పార్టీతో అయిన కలిసేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రజా అభీష్టానికి వ్యతిరేకంగా భాజపా చేస్తున్న పాలనను ఖండిస్తూ సీపీఐ చేపట్టిన ఈ ప్రజాపోరు యాత్ర బహిరంగ సభలో సీపీఐ పార్టీ కంట్రోల్ కమిషన్ సభ్యులు మిరియాల రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి సారయ్య, బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, మండల నాయకులు యలమద్ది రవి, హమాలీ కార్మికులు, మహిళలు, యువకులు, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
