మన్యం న్యూస్ గుండాల: తునికాకు పంట వచ్చి గిరిజనులకు ప్రత్యేక ఆసరాగా నిలుస్తుంది. పంటలన్నీ పూర్తి అయిన తర్వాత తునికాకు పంట రావడంతో మండలంలోని గిరిజనులు తునికాకు సేకరణ వైపు పెద్ద ఎత్తున జనం మొగ్గు చూపుతారు. మే నెలలో కావలసిన తునికాకు సేకరణ ఈసారి మార్చిలోనే ప్రారంభం కావడంతో మండలంలోని గిరిజనులందరూ తునికాకు సేకరణలో నిమగ్నమయ్యారు. తెల్లవారుజాము నుండి పనులన్నీ ముగించుకొని తునికాకు సేకరణ కోసం జనం అడవిలోకి పయనమవుతారు. కొందరు తునికాకు సేకరిస్తూనే కట్టలు కడుతుంటే మరికొందరు మొత్తం సేకరించుకొని తమ ఇంటి వద్దకు వచ్చికట్టలు కట్టుకొని కల్లానికి తీసుకువెళ్తారు. గత సంవత్సరం కంటే ఈసారి 50 ఆకుల కట్టకు మూడు రూపాయల ఒక్క పైసగా ధర నిర్ణయించినట్టు గుత్తేదారు గతంలోనే అఖిలపక్ష నాయకుల సమక్షంలో అంగీకరించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కొరవడంతో గత సంవత్సరం కంటే ముందే తునికాకు సేకరణ గుండాల మండలంలో మొదలైంది. ఒక్కొక్క కుటుంబం తునికాకు సేకరణ ద్వారా 15 వేల నుండి 20వేల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. తునికాకు ద్వారా వచ్చిన ఆదాయంతో రానున్న పంటలకు మందు కట్టాలు లేదా విత్తనాలు కొనుక్కునేందుకు రైతులు మొగ్గు చూపుతారు. ఈ తునికాకు సేకరణ సమయంలో కొందరు ప్రతిఏటా ప్రమాదాల బారిన పడుతూనే ఉంటారు. కొందరు అడవి జంతువుల ద్వారా ప్రమాదాలకు గురి అయితే మరికొందరు వడదెబ్బ తగలడంతో అనారోగ్యం పాలవుతున్నారు. అయినప్పటికీ తునికాకు సేకరణలో మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
తునికాకు సేకరణ ధార 15 వేల ఆదాయం వస్తుంది: ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ ద్వారా 15 వేల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటామని చీమల గూడెం గ్రామానికి చెందిన ఈసం చిన్న నరసయ్య పేర్కొన్నారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులందరం అడవిలోకి వెళ్లి తునికాకు సేకరణలో నిమగ్నమవుతామని ఆయన అన్నారు.
సేకరణ ద్వారా వచ్చిన డబ్బుతో మందు కట్టలు కొంటాం: ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ ద్వారా వచ్చిన డబ్బుతో రానున్న పంటల కోసం మందు కట్టాలు లేదా విత్తనాలు కొనుక్కుంటామని చీమల గూడెం గ్రామానికి చెందిన కల్తి రంగయ్య పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ ద్వారా వచ్చిన డబ్బులు మా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు
