ఘనంగా ‘ఈద్ ‘ వేడుకలు.
– ప్రేమ, సామరస్యానికి ప్రతీక రంజాన్.
ప్రేమను పంచండిస్వార్ధాన్ని వీడండి.ఈదుల్ ఫిత్ర్ వేడుకల్లో ఉస్మాన్ ఖాన్.
మన్యం న్యూస్.ములకలపల్లి. ఏప్రిల్ 22.మండలంలో ఈదుల్ ఫిత్ర్ (రమజాన్ ) పర్వదినాన్ని ముస్లింసోదరులు ఘనంగా జరుపుకున్నారు.ములకలపల్లి, జగన్నాధపురం, మూకమామిడి, పూసుగూడెం, గ్రామాల్లో ఆయా ఈద్గాల వద్ద ఈద్ నమాజ్ ఆచరించారు. పొగళ్ళపల్లి ముస్లింలు ములకలపల్లిలో, మూకమామిడి ముస్లింలు జగన్నాధపురంలో పండుగ నమాజ్ ఆచరించారు. పరస్పర ఆలింగనాలు, కరచాలనాలతో ‘ఈద్ ముబారక్ ‘ అంటూ ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందించారు. ముస్లిమేతర స్నేహితులను ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి, వారితో ఆనందం పంచుకున్నారు. నమాజుకంటే ముందు ఫిత్రా దానాలు చెల్లించారు. ఈద్ గాల వద్ద దానధర్మాలు చేశారు. ఈసందర్భంగా జగన్నాధపురంలో జరిగిన ‘ఈద్ ‘ వేడుకలకు ప్రముఖ రచయిత, జమాతె ఇస్లామి హింద్ జాతీయ సభ్యులు యం.డి.ఉస్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో నమాజ్ చేయించి, ‘ఈద్ ‘ సందేశం ఇచ్చారు. సమాజంలో మానవుల మధ్యప్రేమ, సమానత్వం, సోదరభావం, ఐక్యత, సామరస్యం, పరస్పర అవగాహన పెంపొందాలని,మానవులు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరినొకరు అర్ధం చేసుకోవాలని, మనసులోని కల్మషాన్ని కడిగేసి, గుండెలనిండా ప్రేమను నింపుకోవాలని సూచించారు. ఎవరికి కష్టమొచ్చినా స్పందించాలనీ, సంతోషంలో అందరినీ భాగస్వాముల్ని చేయాలన్నారు. రమజాన్ మాసంలో అలవరచుకున్న ప్రేమ, సహనం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను మిగతా పదకొండు నెలల్లో కూడా ఆచరించాలని తెలిపారు.దేవుడు మానవాళిపై కురిపించిన అనుగ్రహాలన్నిటిలో పవిత్రఖురాన్ అవతరణ గొప్ప అనుగ్రహమన్నారు. మానవుడి భౌతిక అవసరాలకోసం సృష్టిలో అనేక ఏర్పాట్లు చేసినదైవం, వారి పారలౌకిక సాఫల్యానికి ఖురాన్ ద్వారా మార్గదర్శనం చేశాడని, రమజాన్ మాసంలో నెలరోజులపాటు ఉపవాస దీక్షలతో కూడిన శిక్షణ ఇచ్చాడని తెలియజేసారు. రంజాన్ లో అలవరచుకున్న క్రమశిక్షణను మిగతా జీవితంలో ఆచరించాలని తన సందేశంలో సూచించారు. ఉపవాసాలవల్ల పేదవారి ఆకలిబాధలు తెలుస్తాయని,సమాజంలోని పేదసాదల పట్ల బాధ్యతతో మసలుకోవాలన్నారు. పరుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని మేమున్నామన్న భరోసా కల్పించాలన్నారు. ప్రతిఒక్కరూ ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే చెడులు, దుర్మార్గాలు గణనీయంగా తగ్గిపోతాయన్నారు. ప్రేమ, పరోపకారం, సామరస్యానికి ప్రతీక అయిన రమజాన్ స్పూర్తి నిరంతరం కొనసాగాలన్నారు. నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులపట్ల అవగాహన పెంచుకోవాలని, మతోన్మాద శక్తుల దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ వేడుకల్లో జాఫర్, తాహెర్ బాబా, జబ్బార్, అమీర్, సుభానీ, బషీర్, రహీం, అబ్దుల్లా, అజీజ్ , హసన్, జాని, యాఖూబ్, వాజిద్, జునైద్, జానీ, జమాల్, షబ్బీర్ , బాజీ, సమీవుల్లా, ఉబైద్ ,తదితరులు పాల్గొన్నారు
