UPDATES  

 217 కేంద్రాల్లో మేడే జెండాను ఆవిష్కరించిన నేతలు

  • పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక ఎర్రజెండా
  • ఎర్ర జెండా బలపడితేనే శ్రామికవర్గానికి మనుగడ
  • కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమ దినంగా ‘మేడే’ నిలవాలి
  • ఆర్ధిక బకాసురులకు కొమ్ముకాస్తున్న మోడీని గద్దె దించుదాం
  • నాడు వ్యతిరేకించిన వారే ‘మేడే’కు పిలుపునివ్వడం ఎర్రజెండా విజయం
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  • 217 కేంద్రాల్లో మేడే జెండాను ఆవిష్కరించిన నేతలు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

పేదల పక్షాన నిలబడి వారి హక్కు సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని, ఎర్ర జెండా ఎంత బలపడితే పేదలకు, శ్రామిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 137వ మేడేను కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆటో కార్మికులు, భవన నిర్మాణ, హమాలీ కార్మికుల అడ్డాలు, పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్, ఆర్టీసి, కార్మిక వాడలు, బస్తీలు, కార్మిక క్షేత్రాలు, పార్టీ కార్యాలయాలు తదితర 217 కేంద్రాల్లో అరుణపతాకాన్ని ఎగురవేసి చికాగో అవరవీరులకు నివాళులర్పించారు, వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోస్టాఫీస్, ఎంజి రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు, యాజమాన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిందే ఈ ఎర్రజెండా అని పేర్కొన్నారు. వారి అమరత్వంతోనే ఎనిమిది గంటల పనివిధానంతోపాటు అనేక కార్మిక చట్టాలు, హక్కులు ఏర్పడ్డాయని, చికాగో అమరుల స్పూర్తితో భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు ఏలికలు దిగిరాక తప్పలేదన్నారు. బ్రిటీష్ రాజ్యంలో, ఆ తర్వాత స్వతంత్ర భారతంలో పాలకులతో పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను ఏకమొత్తంగా బిజెపి ప్రభుత్వం రద్దు చేస్తోందని, మేడే స్ఫూర్తిగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును కూడా హరించి యాజమాన్యాలకు కార్మికుల శక్తిని దోచిపెట్టే కుట్రలకు పాల్పడుతోందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టసభల్లో ఉన్న మందబలంతో కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ గోసపెడుతోందని, పోరాడి సాధించుకున్న 29 చట్టాలను యజమానులకు అనుకూలంగా నాలుగు కోడులుగా మార్పు చేసిందని అన్నారు. మోసపూరిత కుట్రలు, కుతంత్రాలతో మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, లాభాల్లో నడుస్తున్న సింగరేణి గనులు, రవాణా, టెలికాం, రైల్వే, బ్యాంకులు, , రక్షణ రంగం, ఇస్రో లాంటి తదితర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పణంగా కారు చౌకగా బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారని విమర్శించారు. ప్రజలకోసం కాకుండా ఆర్ధిక బకాసురులకు, ఆర్ధిక నేరగాళ్ళగా మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. దేశ సంపద, కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమ దినంగా దేశ వ్యాప్తంగా మేడేను జరుపుకుంటున్నామని తెలిపారు. కమ్యూనిస్టుల ఉద్యమాలను, ఎర్ర జెండాను నాడు వ్యతిరేకించిన వారే నేడు మేడేను జరపాలని పిలుపునివ్వడం ఎర్రజెండా విజయమని అన్నారు. ఎర్ర జెండా బలపడితేనే కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, వై.శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, గెద్దాడు నగేష్, కె.తర్నకుమారి, పోలమూరి శ్రీనివాస్, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల శ్రీనివాస్, పిడుగు శ్రీనివాస్, నేరెళ్ళ సమైక్య, అబ్బులు, పాషా, నూనావత్ గోవిందు, బానోతు గోవిందు, వనమా శ్రీలక్ష్మి, పి.సత్యనారాయణచారి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, పాటి మోహన్, కృష్ణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !