ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సరికొత్త అనుమానాల్ని లేవనెత్తారు.
మంగళవారం హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కలిసి తమ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్‌ను లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టు చెప్పారని.. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. తొలుత ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఆ కంపెనీ రూ.7272 కోట్లు కోట్ చేసిందని.. కానీ రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని అడిగారు. టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని.. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని అన్నారు. ఆ 16 రోజుల గ్యాప్‌లో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ చేసిన ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు అరవింద్ కుమార్ ఫోన్ కాల్స్ డేటాను ప్రభుత్వం బయటపెట్టగలదా? అసలు ఆ గ్యాప్‌లో అరవింద్ కుమార్ హైదరాబాద్‌లోనే ఉన్నాడా? ఆ 16 రోజులు అరవింద్ కుమార్‌తో పాటు ఎవరైనా బయటకు వెళ్లారా? అని రఘునందన్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఐదు రోజుల పాటు కనిపించకుండా పోయారని కూడా ఆరోపించారు. ఓఆర్ఆర్‌కు అదానీ కంపెనీ రూ. 13 వేల కోట్లకు టెండర్ వేసేందుకు సిద్దమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓఆర్ఆర్‌పై బేస్ ప్రైజ్‌ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని గతంలో హెచ్‌ఎండీఏ డిఫాల్టర్‌గా ప్రకటించిందని.. ఆ సంస్థపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని.. ఈ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ టోల్‌గేట్ ద్వారా ప్రతిరోజూ వస్తున్న ఆదాయం ఎంతో బయటపెట్టాలని, అలాగే ఏప్రిల్‌లో ఎంత అమౌంట్ వచ్చిందో రివీల్ చేయాలని కోరారు. నేషనల్ హైవేలపై టోల్ గేట్‌ల దగ్గర రోజు వచ్చిన ఆదాయం ఎంతో డిజిటల్ బోర్డ్ ద్వారా సంబంధిత ఏజెన్సీ తెలుపుతుందన్నారు.