సందీప్ కుమార్ మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు మౌలిక వసతులతో పరిశుభ్రతను సాధిస్తూ కళకళలాడుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంలో అధికారులు అందించిన కృషి ఎంతో అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోపరిశీలనకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు,జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తూరుబాక గ్రామంలో పర్యటించిపచ్చదనం, పరిశుభ్రత, నర్సరీ, హరితహారం మొక్కలు, బృహాత్ పల్లె పకృతి వనం, మరుగుదొడ్లు, డంపింగ్ యార్డు, వైకుంఠదామాన్ని పరిశీలించారు. అనంతరం తూరుబాక గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలలో పరిశుభ్రత పెరగడంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడినట్లు చెప్పారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కోట్ల సంఖ్యలో పల్లెల్లో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి బృహాత్ పల్లె పకృతి వనాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని చెప్పారు. మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠదామాలను నిర్మించినట్లు చెప్పారు. దేశంలో 2 లక్షల 68 వేల గ్రామ పంచాయతీలున్నాయని వాటిలో 46 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక కాగా వాటిలో మన పంచాయతీలు 13 అవార్డులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏ ఒక్కరు చేయడంతో ఈ ఘనత సాధించలేదని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని చెప్పారు. చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్ గ్రామ పంచాయతి ఆరోగ్య పంచాయతీ విభాగంలో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకోవడం జరిగిందని చెప్పారు. గిరిజన గ్రామాలు, తండాలు అత్యధికంగా ఉన్న భద్రాద్రి జిల్లా జాతీయస్థాయిలో అవార్డులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం జరగాలని చెప్పారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబల కుండా చర్యలు చేపట్టాలని ముఖ్యంగా మురుగునీటి నిల్వలు లేకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయాలని సూచించారు. పరిశుబ్రతలో ప్రధానమైన బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి కుంటుంబం మరుగుదొడ్డి వినియోగించాలని చెప్పారు. మరుగుదొడ్లు వినియోగం, పరిశుభ్రత పాటించుట, అంటువ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లులో చక్కటి ఆకృతులతో బొమ్మలు వేయించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఐందు విడతల పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహణ ద్వారా గ్రామాల్లో చక్కటి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇదే స్పూర్తితో గ్రామాలు మరింత పరిశుభ్రతను సాధించి మరిన్ని అవార్డులతో జిల్లాను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని ఆయన సూచించారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావడం చాలా సంతోషమని చెప్పారు. ప్రతి మండలంలో ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ నిర్వహణ ప్లాంటులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటి నుండి క్రమం తప్పక తడి, పొడి వ్యర్థాల సేకరణ జరగాలని, తడి వ్యర్థాల కంపోస్టు తయారు ద్వారా వ్యర్థాల నుండి ఆదాయనం సమకూర్చుకోవాలని ఆయన స్పష్టంచేశారు. పొడి వ్యర్ధాలను రీ సైక్లింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెల్లో పారిశుద్యం, పచ్చదనంపెరగడంతో పాటు మెరుగైన పౌర సేవలు అందుతున్నాయని చెప్పారు. పల్లె ప్రగతి కార్యమాలు నిర్వహణ పట్ల జిల్లాకలెక్టర్ అనుదీపును అభినందించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జడ్పి సిఈఓ విద్యాలత, యంపిడిఓ ముత్యాలరావు, తహసిల్దార్ గంటాప్రతాప్, సర్పంచ్ భూక్యా చందు, ఉప సర్పంచ్ బి. సత్యనారాయణ, ఎంపిటిసి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
