మంగళవారం ములుగులో జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ మినీ మహానాడు ను విజయవంతం చేయండి
తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ పిలుపు
మన్యం న్యూస్,ఇల్లందు:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారకరామారావు 100వ శతజయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని లీలా ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మినీ మహానాడుకు ముఖ్యఅతిధిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ హాజరు కానున్నారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తెలుగు రాష్టాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ ను ఈ సందర్భంగా స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చేసిన అనేక పథకాలు ఇప్పటికీ ఈ దేశాన్ని నడిపిస్తున్నాయని వారు ముందు చూపుతో చేసిన చట్టాలను నేడు ప్రభుత్వాలు అనుసరించే పరిస్థితికి వచ్చాయని అది ఆహార భద్రత గాని, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు గాని వారి ముందు చూపుకు నిదర్శనం అని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ మినీ మహానాడు కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లందు, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై మహానాడు విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు వంశీ పిలుపునిచ్చారు.