ఇల్లందు మండల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం
*రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలుపన్నినా నా విజయాన్ని ఆపలేరు…
ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ *మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమ ప్రారంభానికి ముందుగా కొన్ని వందల బైకులు, కార్లతో బిఆర్ఎస్ కార్యకర్తలు జై బిఆర్ఎస్.. జై తెలంగాణ.. జై హరిప్రియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి.. అనే నినాదాలతో ఇల్లందు రోడ్లన్నీ గులాబీమయంగా మారి హోరెత్తాయి. భారీ ర్యాలీగా బయల్దేరిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళన ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని, గ్రామగ్రామాలలో బీఆర్ఎస్ అభిమానులు కోకొల్లలని పేర్కొన్నారు. కొంతమంది ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపుతూ కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ని విమర్శించే వారిని నిగ్గదీసి అడగండి.. నిలదీసి కడగండి అంటూ కార్యకర్తలకు సూచించారు. తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని స్వార్థ రాజకీయాల కోసం మరోసారి విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హరిప్రియ హెచ్చరించారు.
జాతీయస్థాయిలో “అబ్ కి బార్.. కిసాన్ సర్కార్” అనే నినాదంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశస్థాయిలో అభివృద్ధిలో పెనుమార్పులతో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారన్నారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు అందిస్తూ రైతును తెలంగాణలో రాజుగా చేయడంలో సీఎం కేసీఆర్ అమోఘమైన కృషి మరువలేనిదని, ఇది ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం అని పేర్కొన్నారు. నిరుపేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లతో అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకునేందుకు లక్ష రూపాయల పై చిలుకును పెండ్లి కానుకగా తెలంగాణప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. కంటివెలుగు యావత్తు దేశానికే ఆదర్శంగా మారిందని, కంటివెలుగు కార్యక్రమంలో ఉచితంగా కొన్ని కోట్లాదిమంది ప్రజలు కంటిపరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు, కంటి శస్త్రచికిత్సలు, ఐ డ్రాప్స్ లాంటివి తీసుకుని లబ్ధి పొందారన్నారు. గతంలో అధ్వానంగా ఉన్న రోడ్లు..నేడు కేసీఆర్ హయాంలో ప్రతిగ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, రాత్రివేళల్లో వీధిలైట్లు, తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, హరితహరం, పచ్చనిచెట్లు, రైతు వేదికలు తదితర వాటితో తెలంగాణపల్లెలు దేశానికే తలమానికంగా నిలిచాయని అన్నారు. కొంతమంది తనను అప్రతిష్టపాలు చేసేందుకు బురద జల్లుతున్నారని అలాంటివారికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా నా విజయాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఇల్లందు నియోజకవర్గంలో ఇన్నేళ్ళకాలంలో ఏనాడూ జరగని అభివృద్ధిని చేసి చుపానని ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయంటూ ఉద్ఘాటించారు. స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శీలం రమేష్, ఎంపీపీ చీమల నాగరత్తమ్మ, డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, యూత్ అధ్యక్షులు మెరుగు కార్తీక్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
