మన్యం న్యూస్, దమ్మపేట, మే, 10: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు తెలిపారు. బుధవారం దమ్మపేట మండలానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు సుమారు రూ.42 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మెచ్చా తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్ చిన్న వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ ధారా యుగేందర్, ఎంపీపీలు జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.