- శభాష్ పాపన్న…
- వంగూరు పాపారావు కు ఉత్తమ సేవా పతకం
- హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా అందజేత
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వంగూరు పాపారావు రాష్ట్ర పోలీస్ ఉత్తమ సేవా పతకం 2022 అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డిజిపి అంజినీకుమార్ సమక్షంలో రాష్ట్ర హోం శాఖా మాత్యులు మహమ్మద్ మహమూద్ అలీ ఉత్తమ సేవా పతకం అవార్డును అందజేశారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వంగూరు పాపారావు ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో నిజాయితీ కలిగిన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన వంగూరు పాపారావు 1995లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యారు. 2023లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన పాపారావు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో వేలేరుపాడు, కుక్కునూరు సత్తుపల్లి, ఖమ్మం ట్రాఫిక్ తదితర పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ముఖ్యంగా ఖమ్మం అవినీతి నిరోధక శాఖ విభాగంలో పనిచేసి ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు ఉత్తమ ప్రశంసలతో పాటు అనేక రివార్డులు అందుకున్నారు. పోలీస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పతకం సేవా పతకం 2012లో, 2022 ఏడాదికి ఉత్తమ సేవా పతకంకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకంతో పాటు
రూ. 30 వేల రివార్డును హోంమంత్రి అందజేశారు. ఉత్తమ సేవా పతకం అవార్డు అందుకోవడం పట్ల పలువురు ఉన్నతాధికారులు, శ్రేయోభిలాషులు పాపారావుకు అభినందనలు తెలియజేశారు.