కామ్రేడ్ దండు వెంకటమ్మ ఆశయ సాధనకై పోరాడుదాం
సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు
మన్యం న్యూస్,ఇల్లందు:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణకమిటీ సభ్యురాలు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్ దండు వెంకటమ్మ ఆశయాల సాధనకై పోరాడాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు పిలుపునిచ్చారు. గురువారం ఇల్లెందు పట్టణంలోని స్థానిక స్టేషన్ బస్తీలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రేడ్ దండు వెంకటమ్మ సంతాప సభలో ఆయన ప్రధానవక్తగా పాల్గొని మాట్లాడుతూ… కామ్రేడ్ దండు వెంకటక్క ఎన్ని ఒడిదుడుకులు, నిర్బంధాలు ఎదురైనా, పార్టీలో చీలికలు వచ్చిన తాను నమ్మిన సిద్దాంతాల వెనక దృఢంగా నిలబడి తుది శ్వాస విడిచేవరకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆశయాలకు కట్టుబడి నిలబడటం గొప్ప విషయమన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యసాధన కోసం ప్రతిఘటన పోరాట అవగాహనతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడిన మహనీయురాలు దండు వెంకటమ్మ అని కొనియాడారు. ముఖ్యంగా స్టేషన్ బస్తీలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదలకు ఇళ్ల స్థలాలు పంచి, ఇంటి నిర్మాణాలను చేపట్టిందని, కాలనీలో మంచినీరు, కరెంటు, రహదారుల నిర్మాణాలను పోరాడి సాధించిందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరవనితగా అభివర్ణించారు. తన ఇల్లును విప్లవకేంద్రంగా మార్చి అనేకమంది పార్టీ నాయకులకు రక్షణ కల్పించిందని అన్నారు. వెంకటక్క మరణం సిపిఐ ఎంఎల్ న్యూడేమోక్రసీకి, పీడిత ప్రజలకు తీరనిలోటని అన్నారు. ఈ మేరకు ముందుగా న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ వెంకటక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామ్రేడ్ వెంకటక్కను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. న్యూడెమోక్రసీ
ఇల్లెందు పట్టణ కార్యదర్శి కామ్రేడ్ కొక్కు సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో న్యూడెమోక్రసీ నార్త్ ఈస్ట్ రీజినల్ కమిటీ నాయకులు యాకన్న, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, బొగ్గారపు సంఘయ్య, పిడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు వై.జానకి, చింత రజిత, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు డి.ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం ఇల్లందు పట్టణ కార్యదర్శి భానోత్ రామ్సింగ్, మాజీ వార్డ్ కౌన్సిలర్ బానోతు రవి నాయక్, వెంకటక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.