UPDATES  

 సీతారామ ప్రాజెక్టును రోల్లపాడు రిజర్వాయర్ గా నిర్మించాలి

సీతారామ ప్రాజెక్టును రోల్లపాడు రిజర్వాయర్ గా నిర్మించాలి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఆవునూరి మధు

*మన్యం న్యూస్,ఇల్లందు…ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సీతారామ ప్రాజెక్టును రోల్లపాడు రిజర్వాయర్ గా నిర్మించాలని, ఎత్తిపోతల ద్వారా ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లెందు న్యూడెమోక్రసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్లపాడులో సభ జరిపి సీతారామ ప్రాజెక్టును రోల్లపాడు చెరువులోకి మళ్లించి రిజర్వాయర్ గా మారుస్తానని, ఏజెన్సీ ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారని తెలిపారు. అలా ప్రకటించి నేటికి ఎనిమిదేళ్లు అవుతున్న సమస్య పరిష్కరించలేదని విమర్శించారు. ఆంధ్ర పెట్టుబడిదారులకు తోడ్పడే విధంగా యాక్షన్ ప్లాన్లో లేనటువంటి సత్తుపల్లి ప్రాంతానికి కాలువల ద్వారా నీటిసరఫరా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోల్లపాడు ప్రాజెక్టును రిజర్వాయర్ గా మార్చాలని తక్షణమే టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. గుండాల, గంగారం మండలాలతో పాటు ఇల్లందు నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు నీళ్లను సరఫరా చేసేవిధంగా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రొంపేడు వరకే ఈ ప్రాజెక్టు కాలువను తీసుకెళ్లి చేతులు దులిపివేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, గంగారం, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, గార్ల తదితర ఏజెన్సీ మండలాలన్నింటికీ ఎత్తిపోతల ద్వారా రెండు పంటలు పండించుకునేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేస్తుందని అన్నారు. వారంరోజుల్లో టెండర్లు నిర్వహించి పనులు చేపట్టాలని, లేనియెడల జూన్ 1నుండి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇదేవిధంగా మొండివైఖరిని విడనాడకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు యాకన్న, ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి కొక్కు సారంగపాణి, జిల్లా నాయకులు డి.ప్రసాద్, సర్పంచులు అజ్మీర శంకర్, చింత రజిత, వాంకుడోత్ శ్రీను, న్యూడెమోక్రసీ ఇల్లందు, టేకులపల్లి మండల కార్యదర్శులు పొడుగు నరసింహారావు, కల్తి వెంకటేశ్వర్లు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సువర్ణపాక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !