- నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు
- ఫెర్టిలైజర్ దుకాణదారులతో సమావేశం నిర్వహించిన పోలీసు శాఖ
- ఏ క్షణమైనా తనిఖీలు చేస్తామన్న డిఎస్పి రాఘవేంద్రరావు
మన్యం న్యూస్, పినపాక:
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు అన్నారు . శుక్రవారం ఆయన సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో పురుగు మందుల దుకాణదారులతో ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల జివిఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులతో, సమన్వయంతో విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు సూచనలు, సలహాలు చేశారు. వ్యవసాయ సీజన ప్రారంభంకావడంతో అన్నదాతలకు అండగా నిలుస్తూ విత్తనాలు, ఎరువులు అక్రమంగా నిల్వచేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై నిఘాపెట్టామని అటువంటి వారిపై క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు ఫర్టిలైజర్ షాప్స్, విత్తనాలు అమ్మే దుకాణదారులు ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మినా, సరఫరా చేసినా, కొనుగోలు చేసినా స్థానిక పోలీస్ అధికారులకు, డయల్ 100 సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు ఏ క్షణమైనా నిర్వహిస్తామని తెలిపారు . ఈ సమావేశంలో తహసీల్దార్ ప్రసాద్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సై పటాన్ నాగుల్ మీరా ఖాన్, కరకగూడెం ఎస్సై జీవన్ రాజ్, పోలీస్ సిబ్బంది, ఫెర్టిలైజర్ దుకాణదారులు పాల్గొన్నారు.