మన్యంన్యూస్ ఇల్లందురూరల్:-
సఫాయి అన్నా… నీకు సలాం అన్నా… అని, గౌరవిస్తే కడుపు నిండదని, పిఆర్సి కమిటీ నివేదిక ప్రకారం బేసిక్ వేతనం 19 వేల రూపాయలు చెల్లించాలని, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూని యన్, ఐఎఫ్ టియు జిల్లా నాయకులు ఎస్ శేషయ్య లక్ష్మణ్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఇల్లందు మండలం కొమరారం, సుభాష్ నగర్ గ్రామపంచాయతీ వర్కర్లు స్థానిక సర్పంచ్ కార్యదర్సులకు డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 51 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి, వివిధ కేటగిరీలన్నింటినీ కొనసాగించాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలన్నారు. 5 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించి, ప్రమాదబీమా 10 లక్షలు, చనిపోతే దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి మూడు జతలు యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, వాటికి నగదు రూపంలో అలవెన్స్ చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, 8 గంటల పని దినం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రాజాలు, రాము, పుష్ప తదితరులు పాల్గొన్నారు.