మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ ప్రజల కష్టాలు రేపటితో తీరనున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కృషి వలన ప్రభుత్వ విధాన పరిషత్ గా మారిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిరకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ డయాలసిస్ కేంద్రం లేకపోవటంతో నియోజకవర్గ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇల్లందులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు హరిప్రియ కంకణం కట్టుకొని నేడు డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు విశేష కృషి చేయటం జరిగింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఇల్లందు నియోజకవర్గ ప్రజల ఎన్నోఏళ్ల కల అయిన డయాలసిస్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో ఇల్లందు ప్రజలకు అన్నిరకాల వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో ప్రజలకు ఆర్థికభారం సైతం తగ్గనుందని పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో 5.76 లక్షలతో బుగ్గవాగు ప్రక్షాళన, డ్రైన్ నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 25 కోట్ల ఢీఎంఎఫ్టీ నిధులతో ప్రతి వార్డులో ప్రజల అవసరాలను గుర్తించి స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆయా పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెరువుకట్ట, కరెంట్ ఆఫీస్, ఆర్ అండ్ ఆర్ కాలనీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుల సహాయ సహకారాలతో ఇల్లందు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధిని చేసి చూపడం జరిగిందన్నారు. అదేవిధంగా 3కోట్ల 75 లక్షలతో బస్ డిపో నిర్మించుకోవడం జరిగిందన్నారు. కొందరు స్వార్ద రాజకీయాలు చేస్తూ డిపో ఆలస్యాన్ని సాకుగా చూపుతూ అవాకులు చవాకులు పెలుతున్నారని, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. కోటి యాభై లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ పనులు జరుగుతున్నాయని, దాని కారణంగానే డిపో ప్రారంభోత్సవం ఆలస్యమైంది అన్నారు. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని కేటీఆర్ చేతులమీదుగా బస్ డిపో ప్రారంభించటం త్వరలోనే జరుగుతుంది అని పేర్కొన్నారు. జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి ప్రాంతమైన ఇల్లందులోని నివాస గృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సాధించి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలిచిన ఇల్లందులో ప్రస్తుతం దాదాపు 80కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగబోతున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలియజేశారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఇలానే తనపై ఉండాలని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తాను అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, పీవీ కృష్ణారావు, టీబీజీకేఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు రంగనాథ్, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
